Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

హరవిలాసము

ములలో నా కీ పదమింక నెక్కడను గానరాలేదు - పయి పద్యోత్తరార్ధము క్రీడాభిరామమునను గలదు. మురారి నాటక శ్లోకభాగము దీనికి మూలము.

మఱియు - 'విభూతిమంగళ, స్నానము జేసి ధౌతపరిధానము గట్టి' (ఆ. 2. ప. 37.) ఇక్కడ యతిని గూర్చి పూర్వము 'భారతి' లోఁ గొంత చర్చ జరిగెను.

స్నానపదము 'స్నానము' అని యుండవలెననియు, నది వేదోచ్చార ప్రకార మనియు, శ్రీనాథుఁడు వేదజ్ఞుడు గాన యట్లు ప్రయోగించెననియు నొకానొకరివాదము. వేదోచ్చారము వేదమునకే కాని భాషకుఁ గాదు. ప్రశ్నమునకు ప్రశ్చ్నము, సంవత్సరమునకు 'సంవత్‌థ్సరము' అని యిత్యాది విధముల వేదోచ్చారమున్నది. సంస్కృత భాషలో నట్టి యుచ్చారము గాని, లిపి గాని, కానరాదు. సంస్కృత గ్రంథములందుఁ గాని, శాసనములందుఁ గాని కానరాకున్నను నీ యతిని రక్షించుటకై యిక్కడ 'స్నానము'ను 'స్త్నానము'నుగాఁ జేయ నక్కఱలేదు. తెలుఁగునఁ దద్భవవ్యాజయతి యని యొక యతి భేదము గలదు. దానిఁబట్టియే ప్రాచీన కవీశ్వరులు 'జ్ఞ'కు 'న' తోను 'కవర్గము'తోను యతిఁ గూర్చిరి. విజ్ఞానము -విన్నాణము, సంజ్ఞ- సన్న, ప్రజ్ఞ -పగ్గె, సంజ్ఞ -సైగ అగుటనుబట్టి 'జ్ఞ కారము'న 'నకారము' గాని కవర్గాక్షర మేది గాని కలదనరాదు. అట్లే స్నానపదము సంస్కృత సమాసగతముగా నున్నను స్నానశబ్దము దద్భవవ్యాజమునఁ దవర్గముతో యతిమైత్రిం జెందెను.

మఱియు నీ హరవిలాసమున 'ప్రారంభం బొక యింత లేకను తృణ ప్రాయంబు నట్లు' అనుచో 'లేకను' అని ప్రయోగమున్నది. ఇది నన్నయ భట్టారకుని 'లేకను సంతానోచ్ఛేద' ప్రయోగముం బోలినది. అక్కడఁ జెప్పఁ దగ్గసమర్థనోపపత్తులే యిక్కడను జెప్పఁదగినవి.

ఈ హరవిలాసము పీఠికాభాగము కొఱఁతగా గ్రంథమెల్ల నొక్క తాటియాకు ప్రతి తంజావూరు లైబ్రరీలోఁ గలదు. పీఠికాభాగ ముండి సప్తమాశ్వాసము లేక ప్రాచ్యలిఖితశాలలో వేఱొకప్రతి గలదు. ఈ రెండు ప్రతుల తోడ్పాటుననే పూర్వము కాకినాడ సరస్వతీ పత్రికాధిపతు లీ హరవిలా