158
హరవిలాసము
క్రమముగాఁ దద్గ్రంథములను జదువఁ దగుదురు. నన్నయ, తిక్కన, నాచనసోమనల తెలుఁగురచనల పోలికలు, మురారి నాటకశ్లోకానుకృతులును నీ హరవిలాసమునఁ గొన్ని కాననగును. విస్తరభీతిచే వాని నిందుఁ జూపకుంటిని. అపూర్వశబ్దములు, ప్రయోగవిశేషములు, లక్షణ విశేషములు నిందు గొన్ని గానవచ్చుచున్నవి. సవిశేషములని పరికింపఁదగిన పద్యాంశమున గొన్నింటి మాత్ర మిందుఁ జూపుచున్నాను. పెడము వెట్టి, చింకల్, వాడెపట్టులు విఱిచి, బారాది దివ్యించి, భోరని కుర్యుచుండ, అంపాజాలంబు గురిసి, అవంచియే కంచి నీకు, ఎలప్రాసఁగుటడ్కులు, మిన్నకమిరెండుకుమారకుఁడు, చిఱుబంతిపసవుతోఁ జెవపు నలఁది, సీకాయ యఱపున జిడ్డువఱపి, కఱవాఁడిగా నూఱి గంటి దీడె, గొజ్జఁగనీటఁ జేపట్టుగావించి, చిత్తవృత్తిన్ మఱాకు, ఒత్తిల్ చీఱి, వానె వైశ్యులఁ బిళ్ళయర్వలను గూడి-ఇట దైతేయుఁడు..... కత్తళముతోడఁ బుండరీకంబుతోలు, మసృణ స్నిగ్ధతరక్షుచర్మమయ, వైయాఘ్రాజినఖండమధ్యమున, ఏటలవినేసి.... గాటెఱుకునఁ గొఱఁతిడి, అబసరపుందెఱంగున - ఇత్యాదులు.
కూచిమంచి తిమ్మకవి లక్షణసారసంగ్రహమున హరవిలాస పద్యములఁ బెక్కింటి నుదాహరించినాడు. ఆయాపట్టులఁ దత్పద్యపాఠముల గుర్తించితిని. మిన్నకమిరెండు, అబసరపుందెఱంగున ఇత్యాదిపాఠములు వ్రాతఁప్రతులలో నున్నట్లే తిమ్మకవి యుదాహరణమునను గలవు. ఇట్టిపట్టుల బూర్వపూర్వతర ముద్రణ పాఠములు గొన్ని సరియైనవిగావు. శక్యమయినంత వఱకవి చక్కఁబఱుపఁ బడినవి. పూర్వ పూర్వతర ముద్రణములందు 'కమ్మనూనె' మైనంటి నలుంగుతో జలకమార్చి యొసంగిరి ధౌతవస్త్రముల్' - (ద్వితీయాశ్వాసము) అని కలదు. 'ఒసగు' సానుస్వార మనుట కాదికవి ప్రయోగములు మృగ్యములు. శాసనములలో ఎసగు, ఒసగులు నిరనుస్వారములుగా నున్నవి. అవి తిక్కనభారతమున నిరనుస్వారములుగాఁ బ్రాసస్థలముల నున్నవి. శ్రీనాథుని గ్రంథములలోనే గుర్తించి నంతలో నిది యొక్కటే 'యొసంగిరి' అని పూర్ణానుస్వారవిశిష్టముగాఁ గానవచ్చెను. దీనిగూర్చి భారతి సంపు. 12, సంచిక 12, పు 881 -4 చూడఁదగును.