Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఉత్తరహరివంశము

ఈ కవీశ్వరుని రచనము పెక్కుపట్టులఁ దిక్కనసోమయాజి రచనమును బుడికిపుచ్చుకొన్నట్టు గానవచ్చును. భారతమున సంజయునిరాయబారమును, ఉత్తరహరివంశమున హంసడిభక కథలో జనార్దనుని రాయబారమును బోల్చిచూచిన నీ విషయము తేటపడఁగలదు. మఱియుఁ దిక్కనవోలె నీతఁడు మాటలు తేటగానున్నను లోఁతుగా నాలోచించినఁగాని యర్థముగాని యట్లుగా ననేకపద్యముల రచియించినాఁడు. హంసడిభకోపాఖ్యాన మీ గ్రంథములోని కథలలోనెల్ల హృద్యతమమై విరాజిల్లుచున్నది.

తెలుఁగువాఙ్మయమున నితరకవులెవ్వరును సాధారణముగా బ్రయోగించి యెఱుఁగని యుపమానములను, అర్థాంతరన్యాసములను దృష్టాంతములను నీతఁడు ప్రయోగించెను.

బీరపుఁబొత్తముఁగట్టుకొనిపోయె, పువ్వులు వేడుకైనఁ గడివోయిన వాళ్ముడువంగవచ్చునే, ఎంతదఱిఁగిన మిరియాలుం జొన్నలసరిపోవె, కొఱ్ఱెవ్వఁడింటికంబము సేసెన్, [1]నోఁచినవారి సొమ్ములవి నోమనివారిని వచ్చునే ధరన్

పిడుగు చిట్లిన భంగిన్, జీలుగు వెఱిగిన మాలెకుఁ గంబంబుగాదు, చెఱువువిడిచి కాలువఁ బొగడంజనునే, ఎదిరి కిన్మడఁచువాఁడు. తనకుఁ దగరంబు నఱచు టెంతటిభరంబు - ఇత్యాదులు. ఈ కవి యుద్దవర్ణనలు తత్కాలపు యుద్ధములఁజూచి చేసినట్లున్నవి.

ప్రాచీనాంధ్ర కవికృతులలో దురవబోధము లనఁబడువానిలో సోమనాథునికృతి ప్రధానమయినది. అప్రతీతపదప్రయోగాభిమానము చేతను, శయ్యానైగనిగ్య సంపాదన ప్రీతిచేతను, అనుప్రాస విన్యాసాభిరతి చేతను, నీతఁడు తనకృతిని బెక్కుపట్టులందు దురవబోధము గావించెను. అందును వచనరచనలో మఱియుఁ గఱకుఁదనముఁ జూపెను. ఆంధ్రకవులలోఁ జిత్ర

  1. ఇదే చరణము సమస్యగా మైలమభీమని పేర నెవరో పూరించినారు. ఆ పూర్తి కూడ నీతనిది యయినను గావచ్చును. అదియిది :-


    ఉ. యాచకఖేచరుండు సుగుణాంబుధి మైలమభీముఁ డీల్గినన్
         జూచి వరించె రంభ యెడఁజొచ్చెఁ దిలోత్తమ; దారి నిద్దఱన్
         ద్రోచె ఘృతాచి ముగ్గురకు దొద్దడికయ్యమువుట్టె నంతలో
         నాఁచుకుపోయె ముక్తిసతి నవ్విరి యద్దశఁ జూచి నిర్జరుల్
         (నోఁచినవారిసొమ్ములవి నోమనివారికి వచ్చునే ధరన్ )