వేటూరి ప్రభాకరశాస్త్రి
127
పాటలతోను, పదములతోను గూడిన పసిపిల్లలయాట లనేకములున్నవి. వానిలో వింత వింత విషయము లనేకములున్నవి. గణనీయమైన కవితయున్నది. బాలభాషలో నాకు శక్యమయినంత వాని సమకూర్చినాఁడను.
నన్నయాది కవీశ్వరులు తమ దేశకాలములను దెలుపుకొనుటచే వారి గ్రంథముల ప్రాచీనత యెట్టిదో మన మెఱుఁగఁ గల్గుచున్నాము; కాని యీ పాటలు ఈ కాలమున వెలసినవని, వీరు రచించిరని చెప్పుట కెట్లు సాధ్యమగును? నన్నయాదుల కింకను బ్రాచీన కాలమునాఁటివిగూడఁ గొన్ని యిందుండవచ్చును. నిన్న నేఁటివిగూడ నుండవచ్చును. నన్నయాదుల రచనముల కింక నెంతో పూర్వమే యిట్టి రచనములు పుట్టియుండక తీఱదు. నన్నిచోడాదు లిట్టివానిఁ బేర్కొన్నారు. పాల్కురికి సోమనాథు డిట్లనుచున్నాడు.
పొందంగ "రాగుంజ పోగుంజ లాట"
కుందెన "గుడి గుడి గుంచంబు లాట”
“అప్పల విందుల యాట" పల్మాఱు
చప్పట్లు వెట్టెడు " సరిగుంజ లాట"
“చేర బొంతల యాట” “చిట్లపొట్లాట”
“గోరెంతలాట” “దాఁగుడు మూతలాట,”
వీనిలో “గుడిగుంచ" మాట, “చిట్లపొట్లాట” ఇప్పటికిని ఇదే యుపక్రమముగల పదములతో బాలకు లాడుకొనుచున్నారు. చూచితారా ! ఆ పదము లెంత ప్రాఁతకాలమునాఁటివో !
( ఈ వ్యాసము తొలుత “కళ” (1923) లో ముద్రితము. "బాలభాష (1950) పీఠికగా స్వీకృతము.)