iv
సర్వంకషమనీష
(మణిమంజరి ప్రచురణలో ఉన్నది. యథాతథం)
డా॥ అక్కిరాజు రమాపతిరావు
శ్రీ శాస్త్రిగారు ఆత్మదర్శనులు. సర్వతోముఖమైన పాండిత్యం వారిది. ఏదైనా ఒక విషయం చెప్పటాని కుపక్రమించినప్పుడు కొత్తకోణం ఒకటైనా చూపించటమూ కొత్తదైన ఆవిష్కారాన్ని ఒకటైనా ప్రతిపాదించటమూ వారు చేసుకున్న ప్రతిజ్ఞ. ఇది ఎంతోకష్ట సాధ్యమైన విషయం. అయినా ఈ ప్రతిన వారి విషయంలో అవితథంగా సాగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వ్యాఖ్య, సమీక్ష, విమర్శ, కావ్య విషమఘట్ట అర్థతాత్పర్య నిర్ణయం, సాహిత్యచరిత్ర, కవికాలాది, కర్తృత్వ వినిర్ణయాది విషయాలలో వారి మాట ఘంటాపథం. మత, చారిత్రక, సాంస్కృతిక, పురాతత్వ, ఆలయశిల్ప విజ్ఞాన ఆధారస్థ సమీచీన సమన్వయంలో వారి ప్రతిభ మేరలేనిది. ప్రజ్ఞా చక్షువు అనే మాట వారికి అన్నివిధాలా అనువర్తిస్తుంది.
అంతర్ముఖ సమారాధ్యత ఆయన చిత్తవృత్తి. ఏదైనా ఒక విషమఘట్టం, సమన్వయం కాని సమస్య ఎదురవుతే దాని సమాధానాన్ని వారు నిమీలిత నేత్రులై అంతఃకరణం ద్వారా ఆవిష్కరించేవారు, అని వారిని సన్నిహితంగా ఎరిగున్న పరిశోధనప్రవణులు, అంతరంగకోటిలోని వారూ చెప్పుతున్నారు. ఈ విధంగా వారు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. అవి సాహిత్య చరిత్ర పురాతత్త్వ అపరిష్కృత, అసమన్వయీకృత విషయాలను నిర్ణయించటానికి తోడ్పడ్డాయి.
శాస్త్రిగారి వచన రచన 'లలిత విస్తరం'. వారి సూత్రఫక్కిక 'ప్రజ్ఞాపారమితం.' 'నన్నయది పురాణశయ్య. తిక్కనది కావ్యశయ్య. నన్నయ భారతభాష నాగమ సూత్రస్మృతి భాషనుగా భావించుచో దిక్కన భాషను గాళిదాస కావ్యభాషనుగా బరిగణింపవచ్చును. నన్నయ దొక ఋషిమార్గము. తిక్కనదొక రసమార్గము' ఇత్యాది వారి సాహిత్య దర్శనం తరువాత కాలంలో సుప్రసిద్ధ విమర్శకులకు ఆనంద చక్షురున్మీలితం చేసింది. విశ్వనాథవారు కల్పవృక్షకావ్యావతారికలో 'ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట' అని శాస్త్రిగారి దర్శనాన్నే అనువదించారు.