106
క్రీడాభిరామము
బట్టి - యప్పటి సంగమరాజుల సామ్రాజ్యవ్యాప్తి కీతఁడు తోడ్పడినట్లు తెలియనగును. రెడ్డిరాజుల యేలుఁబడిలో నుండిన వినుకొండ ప్రాంతమును క్రీ. 1372 నాటికి సంగమవంశీయులు సంపూర్ణముగా వశపరచుకొనిరి. కాని, తిరిగి క్రీ. 1377 ప్రాంతమున అన వేమారెడ్డి తిరిగి యీ ప్రాంతమును లోఁబరచుకొనెను. నాటి నుండి రెడ్డి విజయనగర రాజుల కాయాప్రాంతములఁ గూర్చి తగవు లుండెడివేమో. నాడే లింగనమంత్రి రాయలకు సాయపడియుండును. ఇతర రాజుల మంత్రు లనెడితారల కీ లింగనమంత్రి చంద్రసదృశుఁడట. పరాక్రమము మాటటుంచి ప్రతిభచేతనే శాత్రవులను నిస్తేజస్కులఁ జేయువాఁడు కాబోలును. ఆనాళ్లలోనే లింగనసోదరుఁ డగు తిప్పన కూడ రాయల నాశ్రయించి వినుకొండ ప్రాంతము లందుండిన రాయల నవరత్నభాండారమున కధికారిగా నుండియుండును. క్రమమున నీతఁడును సోదరునివలె తన ప్రతిభా పరాక్రమములచేత రాయలను మెప్పించి మహాప్రధానియై యుండును. ఈ సోదరుల సాయముననే కావచ్చును రెండవ హరిహర రాయలు తిరిగి వినుకొండ ప్రాంతమును క్రీ. 1384 ప్రాంతమున జయించగల్గెను. తిప్పన అప్పుడే వినుకొండ దుర్గాధ్యక్షుడై యుండును. ( ఆ సమయమున వేరొక రెవరేని యా దుర్గమును బాలించుచుండి రనుటకునుఁ దగిన యాధారములు లేవు). ఆ మీఁదటనే బలశాలు రగు రెడ్డిరాజులతో విజయనగరరాజులు బాంధవ్య మేర్పరచు కొనవలసి వచ్చినది. అది నృపనీతి. ఆ నృపనీతి నాటి మంత్రిపుంగవుల పలుకుబడిచేత నిర్వహింపఁబడి యుండును. అందుకేనేమో త్రిపురారాతి మహాప్రధానుఁడు "నృపనీతివ్యవహార కార్య ఘటనా నిర్ధారణా శాలి" గా వర్ణితుఁడైనాడు. అట్లు బాంధవ్యమేర్పడిన తర్వాత రెడ్డి విజయనగర చక్రవర్తులు తమతమ యేలుబడులలో నున్న కొన్నికొన్ని ప్రాంతముల నిచ్చి పుచ్చుకొనుట జరిగినది. బాంధవ్యము దృష్టితో నే ప్రాంతమెవరిక్రిందనున్నను నాడు వారివారికి చెల్లుబడి యగుచుండిన పలుకుబడికి మాత్రమెట్టి యాటంకము నుండియుండదని భావించవచ్చును. ఆ దినములలోఁ దిప్పన వినుకొండలో నెన్నాళ్లుండెనో యెరుగరాదు. బహుశః హరిహరరాయల తుది దినములలోనే తిప్పన కుమారుఁడగు వల్లభరాయఁడు మోపూరు పాలకుఁడుగ నియుక్తుఁడై యుండును. తొలుత వీరి పూర్వులు