100
క్రీడాభిరామము
విశేషణవిశేష్యములను దఱచుగా నేక విభక్తిలోనే నిలుపుచుండు టీతని సంప్రదాయము కావున నీ యన్వయ మిట్లే యనఁదగును.
వంశక్రమము
ఈ వల్లభరాయని వంశవర్ణనమును “మిక్కిలి తప్పులతో అనన్వితముగా నున్నదానిని జాగ్రత్తగాఁ బరిశోధించి ఉచితవిధముగ సంస్కరించి” వంశవృక్షమును పూజ్యులు మా పితృపాదులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఒక విధమున బ్రకటించిరి. (చూ. పీఠిక. పుట 13) వారి సంస్కారముల నన్నిట నంగీకరించియుఁ దుద కొకచోటమాత్ర మంగీకరింపక కొంద రించుక భిన్నముగాఁ దలచిరి ( చూ. శ్రీ బండారు తమ్మయ్యగారి పీఠిక - క్రీడాభిరామము, వావిళ్ళవారి ముద్రణము 1953). ఆ విమర్శకుల యభిప్రాయమున గృతికర్త యనఁబడిన వల్లభుని తాత తండ్రు లిరువురును దిప్పనలే. రాయనవరత్నభాండార రక్షకులే. తాత తిప్పనకు సోదరుఁ డగు లింగన వీరహరిహరరాయల సేనాని. అనఁగా లింగనమంత్రి వల్లభునకుఁ బెదతాత. ఇక, బెదబుక్కరాయల మంత్రి యయిన చంద్రామాత్యుఁడు వల్లభుని తాత యగు తిప్పనకు ముత్తాత (అనఁగా తాత తండ్రి) యగును. కాని, కొన్ని కారణములచేత నే నీ యభిప్రాయముతో నేకీభవింప జాలకున్నాను. శ్రీ శాస్త్రిగా రభిప్రాయపడినట్లు లింగనమంత్రి సోదరుఁడగు తిప్పిన యొక్క తనయులు మువ్వురిలో నడిమి వాడుగాఁ బేర్కొనఁబడిన 'మల్లన' యే వల్లభుఁడు కాదగుననియు, నట్లు సంస్కరింపఁదగు ననియు విశ్వసించుచున్నాను. శ్రీనాథుఁడును వల్లభరాయఁడును సమకాలికులై కాలముకూడ నందుకుఁ బొంది పొసఁగియే యున్నది. దానికి హేతువులివి.
1. వంశ వర్ణనమందలి రచనాసంప్రదాయ మిందుకుఁ దగియున్నది.
చూడుఁడు :
“మల్లనమంత్రికిం ద్రిపురమాతరళాక్షికిఁ గాంతి రోహిణీ
వల్లభు లాత్మసంభవులు వల్లభ లింగన తిప్పన క్షమా
వల్లభమంత్రి శేఖరులు వారవధూజన పుష్పభల్లు లు
త్ఫుల్ల యశోవిభాసితులు పుణ్యులు సింగనభైరవేంద్రులున్.