వేటూరి ప్రభాకరశాస్త్రి
81
తంజావూరి కరిగి తునాతునుకలై యున్న మాతృక నెట్టెట్టో పొందించుకొని లుప్తభాగములను' సాధుపాఠములను సేకరించుకొని వచ్చితిని. ఈతూరి మరల నెవ్వఁడేని యీ ప్రతి నెత్తుకొనిపోయెనా యిఁక దురుద్దరమే క్రీడాభిరామము : ప్రత్యంతరమిఁక లేదు : సాధుపాఠ సంపాదన మిఁక శక్యము గాదు! దేశ చరిత్ర, సంఘచరిత్ర, భాషా చరిత్రాదులను బరిశీలించువారికి బహూపకారక మయినది శ్రీనాథరచితమయినది, ప్రశస్తరచనము గలది యన్న యభిమానముచేతనే దీని నిప్పుడిట్లు సంస్కరించి మరలఁ బ్రకటించుట. అంతేకాని, దీనిలోని రోఁతవిషయములమీఁది ప్రీతిచేతఁగాదు. పామరుల కందకుండఁ బండితులకే విక్రయింతుమని ప్రకటకులు బాసచేసిరి గావునను, గుప్తపఱచుట వ్యాప్తి నధికపఱచును గావునను, యథావస్థితముగా ముద్రించుటే మంచిదని పలువురు ప్రాజ్ఞు లభిప్రాయపడిరి. గావునను, దీనిని వికారపఱుపక యున్నదున్నట్లు ముద్రించితిని. ఈ పీఠికలోఁగూడఁ దుచ్ఛములయినను గొన్ని శ్రీనాథరచనములను దచ్చరిత్ర ప్రయోజనములను బట్టి, కవితాచమత్కృతి మీఁది యాదరమును బట్టి చేర్చితిని. శ్రీనాథకవి సౌర్వభౌముని రచన లేవియుఁ జెడిపోకుండ నెలకొనియుండుఁగాక యనియే నా కోరిక. ఆ కవి యంత యభ్యర్హితుఁడు. ప్రఖ్యాతాంధ్రవిద్వాంసులతోఁ బలువురతో యోజించి ఈ గ్రంథమిట్లు ముద్రితమగుట యెంతయు నావశ్యకమేయని నిశ్చయించితిని. విద్యావైదుష్య విభవాధికులగు నాంధ్రమహాశయులు గొందఱీ గ్రంథప్రకటనము గూర్చి యొసఁగిన సదభిప్రాయముల నిందు జతకూర్చుచున్నాను. పామరులకుఁ గాక ప్రమాణపత్రమొసఁగిన పండితులకే విక్రయించుటకుఁ బట్టుదలతోఁ గట్టుదిట్టములతో వర్తింతురుగాకని ప్రకటకులను, పామరులకంటఁ బడకుండ నెక్కడఁగాని దీనిమూలమునఁ జెడుగు గలుగకుండ భద్రపఱిచి యుంచుకొందురుగాకని దీనిని గొను ప్రాజ్ఞులను హెచ్చరించుచున్నాఁడను. ఏ నూఱేండ్లనుండి జీవముతోనున్న ఈ గ్రంథమిఁక నంతరింపదు. ప్రాజ్ఞలోకమున కీ గ్రంథము పరితోషము గూర్పఁగలదనియే నా విశ్వాసము.
విభవ
శ్రీకృష్ణ జయంతి
విద్వద్విధేయుఁడు
7 - 9 - 28
వేటూరి ప్రభాకరశాస్త్రి