వేటూరి ప్రభాకరశాస్త్రి
71
గావించెను. అన్నియర్హతలకంటె నధికముగా శయ్యాసౌభాగ్యమునే శ్రీనాథుఁడు చక్కఁ జూచుకొనును. ఈ క్రింది పద్యముఁ జదువుఁడు.
శా॥ ఆకాశాంచలవీథుల న్నిగిడె సంధ్యారాగరేఖావళుల్
పాకోన్నిద్రిత పారిభద్ర పటలీ పాండిత్య వైతండికో
త్సేక స్ఫూర్జిత చండ తాండవరయోద్రేకారభ ట్యుద్భట
శ్రీకంఠ స్థిరకంఠ కోమల జటాశ్రేణి న్విడంబించుచున్. (భీమ. 2-32)
శయ్యబిగింపేకాని యిందర్థంపు సొంపేమున్నది? ఆకాశాంచల వీథులందు సంధ్యారాగ రేఖలు సాగినట్లే యీ పద్యము ప్రథమచరణమునఁ బదరచన సాగినది. తక్కిన చరణములును దానికిఁ దగినట్లు నెగడినవి. కొన్నిచోట్ల నిట్లున్నను నెన్నోచోట్ల శ్రీనాథుఁడు శ్రవణమాత్రముననే సంతోషము గొల్పఁజాలు గడుసరి నుడికారములను సంస్కృతాంధ్రములలో జతన పఱిచి సరసార్థముతోఁ జతుర రచనల నెఱపెను.
సీ॥ హాలాహలం బనునల్లొ నేరెడిపండు
మిసిమింతుఁడును గాక మ్రింగినాఁడు
పెనువ్రేలికొనగోర బిసరుహాసనుమోము
కెందమ్మివిరివోలె గిల్లినాఁడు (భీమ. 1-110)
చంద్రఖండములతో సరివచ్చుననవచ్చు
విమల దంష్ట్రాప్రరోహములవాని (ప్రబంధర. 131 పు)
.................................................................
ఱవఱవ మండు నెఱ్ఱనిచండ్రమల్లెల
చోద్యంపుగుండాలు సొచ్చువారు (క్రీడా. 142 ప)
ఇట్టిచోట్ల ముందు ముచ్చట గొల్పునది పదచమత్కారము. చక్కని శయ్యతో నింత వింతపదముల సంతరింపుతో నర్థంపుసొంపునుగూడ ననుగతపఱుచుట శ్రీనాథుని కవనమందే కాననగును. నన్నయాదులగు నాంధ్ర కవీశ్వరుల రచనములను సవిమర్శముగాఁ జదువు సరసవిద్వాంసుల కెక్కువగా శ్రీనాథుని పద్యములుమాత్రమే జిహ్వ నూఱించును. మఱపునఁ బడకుండ మనసున నత్తుకొనియుండును. నాల్కపై నాట్యమాడుచుండును. శ్రీనాథుని
శిష్యులయి యాతని చరణములఁబట్టుకొన్న తర్వాతికవుల కృతులలోఁగూడ, గొన్నింట నట్టిరచనలున్నవి. శ్రీనాథుని తర్వాతికవులకుఁ బలువురకు శ్రీనాథునిరచనలు మేలుబంతులు. పిల్లలమఱ్ఱి పినవీరన, దగ్గుఁబల్లి దుగ్గన,