Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

69

ఆమె క్రీ.శ. 1437 ప్రాంతముల బెజవాడ పాపవినాశన దేవరకును, రుద్రపాదములకును బహుగ్రామము లందుఁ దనకుఁ జెల్లివచ్చుచున్న భూముల నెన్నింటినో ధర్మము చేసినది. [1]ఈ విషయమును జెప్పు బెజవాడ

శిలాశాసనమున నామె నృత్యము చేయుచున్నట్టు విగ్రహచిత్రముగూడఁ గలదు[2] . ఆమె భాగ్య సంపన్నురాలు, ప్రఖ్యాత నర్తకి, విజయవాటీనివాసిని. కావున, నిట్టియామెను శ్రీనాథకవి సార్వభౌముఁడెఱిఁగుండును. మనకథాపాత్రములు మాచల్దేవియిల్లుదాఁటి యట కొంత చని యింకొక వేశ్యయింట ముకురదీక్షోత్సవమును జూచిరి. 'ముకుర వీక్షావిధానంబు మొదల లేక, వెలపడంతికిఁ గారాదు విటునిఁ గవయ' నట: మదనరేఖ యనునా వారకన్య కీమంచెనశర్మ తండ్రి. ఈతఁడే యాముకురదీక్షను జరపెను. 'శ్రీవర్ధస్వ' మను మంత్రమును జెప్పి యాబాలిక నాశీర్వదించెను. ద్విజేతరుల నాశీర్వదించునప్పుడు నేఁడును “శ్రీవర్ధస్వ" మని యారంభము గల సంస్కృతమంత్రమును బ్రాహ్మణులు పఠింతురు. పై వేశ్యయింటఁ గథాప్రసంగమున మనకథాపాత్ర మగు మంచెనశర్మ శ్రీకాకుళాంధ్రనాయకస్వామికి వైశాఖపూర్ణిమనాఁడు జరగు దవనోత్సవము [3]నాఁటి శృంగార విహారవిశేషములఁ జెప్పినాఁడు. దానిలోని సారాంశములు : కాకుళేశ్వరస్వామి నాగదేవభట్టారకునింట కాఁకరపాదులో వెలసినాఁడు. పసిఁడి కోరను వేఁడిపా లారగించినాఁడు. విప్రకన్యను బొందినాఁడు (ఇది శ్రీకాకుళక్షేత్రమాహాత్మ్యకథలో నున్నది). శ్రీకాకుళ పుణ్యక్షేత్రము పండ్రెండు క్రోశముల చుట్టుకొలత గలది. అక్కడి తిర్నాళ్ళలో నా వెలనాటిదేశపు (ఆ దేశమునకు వెలనాడని పేరు.) బాలవితంతువుల దుర్వర్తనముల జుగుప్సావహవర్ణన కొంత. ఆ పట్టున శ్రీకాకుళేశ్వరుని యుత్సవమునకు వచ్చినగోవాళ్లు 'బెరసి వెన్నెల గాయంగఁ బేరకమ్మపులిన తలముల' విహరింతురని కలదు. నేఁడు శ్రీకాకుళక్షేత్రము కృష్ణామహానది వలపలియొడ్డున నున్నది. పేరకమ్మపులినతలములనఁగా కృష్ణానదీసైకత ప్రదేశములా యని సందేహము తోఁచును. అట్లేని, కృష్ణానదికే పేరకమ్మయని నామాంతరము గావలెను. అట్లెక్కడనూ గానరాదు. గణపతిదేవ చక్రవర్తి నాఁటిదగు మందరము శిలాశాసనమున ( ఈ గ్రామము శ్రీకాకుళపుకృష్ణ కింకను ఎగువను బెజవాడకు

  1. దక్షిణహిందూదేశ శాసనసంచయము. 4 వాల్యుం 773 నెం. శాసనము చూచునది. చూ. అనుబంధము.
  2. చూ. చిత్రపటము
  3. చూ. అనుబంధము.