వేటూరి ప్రభాకరశాస్త్రి
67
కామవల్లి కృష్ణగీతాలాపములకుఁ జొక్కి దక్కి దక్కించుకొనఁగోరెను. కృష్ణుఁడు పరస్పరశాపవిధముల నెఱిఁగించెను. కామవల్లి విరహోద్వేగమున మిగుల దుఃఖించి ప్రార్థించెను. ఎపుడు నన్నుఁ జూడఁగోరుదువో అపుడెల్ల నా యాకారరేఖ చూపుదును. దాన నీకుఁ గొంత శాంతి కలుఁగగలదు. మఱియు నీ యవతారమున భీష్మకనృపతికి నీయంశము రుక్మిణి యని జన్మించి నన్నుఁబొందఁగలదు. దానఁ గొంత నీకు శాంతి కల్గును. మఱియు ధర్మదయాపరులయినయాస్తికులు నిన్నిలువేల్పుగా నర్చింపఁగలరు. వారి యర్చనలవలనఁ గొంత శాంతి కలుగఁగలదు. వీనిచే మద్విరహవేదనాభరము నోర్వఁగలవు. నిన్నుఁ గొల్చుచుండువారి కభీష్టము లొసఁగుచుండుము. మఱియు ధరణిపైనవివాహిత లగువధువుల నెల్ల నీవు పూనియుండుము. నేను వరులను బూని యుందును. వారిదాంపత్యమే మనదాంపత్య మగును. కల్క్యవతారమునఁ దప్పక నన్ను నీవు పొందఁగలవు" అని వరము లిచ్చెను. కామవల్లి యంశమున రుక్మిణి జనియించి శ్రీకృష్ణునిఁ బొందెను. కామవల్లీమహాదేవి ధరణిపై డెబ్బదిరెండు స్థానముల కొలఁకులందు మహోత్సవము లందుచు వెలయుచున్నది. క్రీడాభిరామవర్ణనములు గూడ మీఁదికథనే సూచించుచున్నవి.
మనకథాపాత్రము లట వెడలికొంత చనఁగా మైలార వీరభటులుగాన వచ్చిరి. 'మైలారదేవర' భైరవుని తోడిజోడట: స్కాందపురాణమున నేతన్మాహాత్మ్యముఁ జెప్పుఖండము 'మైలారఖండ' మని యొకటి గలదు. మైలార వీరభటుల చేష్టలలో గొరగపడుచు చేయువింతలు గొన్ని వర్ణితములయ్యెను (చూ. 143, 144 ప.). ఆ వింతల నిప్పుడును దొమ్మరి పడుచులు చేయుచున్నారు. గొరగలు శివార్చాపరు లగు దేశద్రిమ్మరి తెగవారు గాఁబోలును. అట కొంత చనఁగా నీ క్రిందిదేవళము లొక్కటొక్కటిగాఁ గానవచ్చెను. భైరవుని గుడి చమడేశ్వరీ మహాశక్తినగరు, వీరభద్రేశ్వరాగార మంటవము- బౌద్ధవిహారము, ముద్దరాలు ముసానమ్మవనతి, కొమరసామిగుడి, పాండవుల గుడి, తురకమసీదు - వీని కన్నింటికిని నవ్వలఁ గొంతదూరాన గోపురముల మీఁది బంగారుశిఖరములు రవిదీప్తిని బ్రజ్వలించి మేరుశిఖరములుంబోలెఁ దోఁవఁగా, కేశవ స్వయంభూదేవుల దేవాలయములును గానవచ్చెను. అప్పటికి మధ్యాహ్నకాలమయ్యెను. రాచనగరిమోసాలమీఁది గడియారమునఁ బదునాఱు గంటలు మ్రోఁగెను. మనకథా పాత్రములు పూటకూళ్ళింటికి భుజింపఁబోఁదలఁచిరి. ఏతత్కథా