Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

క్రీడాభిరామము

వారికిఁ గాపుగాఁ బోతురాజును సృజించి యట నిలిపి తా నరిగెను. ఒకనాఁడు బ్రహ్మదేవుఁ డాకొలనికి వచ్చి వారి స్థితుల నెఱిఁగి దాదెమ్మ యను నామెను వారి పోషణకై సృజించి పోతురాజునకు శాంతి పుట్టింపఁగాఁ దగిన యామెను కూనలమ్మను సృజించి యా పోతురాజునకు భార్యనుగాఁ జేసెను. ఆ కొలని దగ్గఱనే కనకావతీపుర మనునొకపురము నిర్మించి యందు వారికి వలయు సర్వసౌకర్యముల నొడఁగూర్చెను. వారందుండిరి. ఇట్లు కొంతకాలము గడవఁగా కామవల్లి యొకనాఁడు శివునికొల్వున కరిగి తదనుగ్రహము వడసెను." అప్పుడు


“ఆపార్వతీశ్వరుం డతిసంభ్రమమున
నిరవొప్పయక్షుల నిద్దఱఁ బిలిచి
మురువొప్ప జక్కులముద్రలు చేసి
ఉరుమలు మద్దెల లుపకరణములు
కర మొప్పఁ దగినవి గావించి యిచ్చి
ముత్యాలరంగముల్ మున్నూఱు చేసి
అత్యంతముదముతో నడిగిన వేళఁ
జిందెముల్ బోనముల్ శృంగారములును
అందముల్ పఱికెలు నానందములును
ఆ రీతి సంతస మందగాఁ జేసి
సారెకు ముద్రల జక్కులఁ బిలిచి
రమణ మీవంశ పారంపర్య మెల్ల
కమలాక్షిఁ గొలువుండు కామవల్లెమను
కామవల్లిని గొల్చుఘను లెల్ల మున్నె
ప్రేమతో మిముఁ జాలఁ బ్రియము చేసెదరు".


అని కట్టడ చేసెను. అట్లు జరుగుచుండెను. ఒకప్పుడు శ్రీకృష్ణమూర్తి బృందావనమునఁ బశువులఁ గాచుచు విహరించుచుండఁగా నీయక్కలు సర్వాభరణభూషితలై యక్కడి కొలన విహరింపనేఁగిరి. " గుభులు గుభుల్లనఁ గొలనిలో నుఱికి, వాల వాలేవాల వాలవా లనుచు వాలఁ బెట్టుచు" వారెల్లరును నోలలాడుచుండిరి. శ్రీకృష్ణమూర్తి తక్కిన గోపాలకులతో గోవుల నీరు ద్రావింపఁ గొలనికి వచ్చెను. ఆ గోవులు కొలను చీకాకు పఱిచెను. కామవల్లి గోవులను గోపాలకులను శిలలుగా శపియించెను. కృష్ణుఁడు వారి చీరల హరించి పొన్నచెట్టెక్కి సంగీతముపాడెను. శిలలెల్ల మరల గోవులు గోపాలురు నయిరి.