పుట:విక్రమార్కచరిత్రము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

217


శా.

ఉర్వీచక్రమునం జరాచరములై యొప్పారురూపంబులన్
దుర్వారోన్నతి లోనుచేసికొని చేతోవృత్తి కాశ్చర్యమై
పర్వెం జీఁకటి నీలనిర్మలరుచిన్ భవ్యప్రభావంబునన్
‘సర్వం విష్ణుమయం జగ’త్తనుట నైశంబైనచందంబునన్.

65


వ.

ఇట్లు క్రమంబునం దమంబు నిగిడి, మిఱ్ఱుపల్లంబు బయ లోలం బని యేర్పఱుప రాకున్నసమయంబున, నటమున్న సాహిణి నడిగి తెచ్చి సన్నద్దసర్వాయుధంబై యింద్రాయుధం బనుతురంగంబు నంతరంగంబు సంతసం బెసంగ నంగనాసహితం బారోహణంబు చేసి, పౌరులెల్ల నిద్రించుచుండఁ దలవరులఁ గన్నుఁబ్రామి పురంబు నిర్గమించి, నిజపట్టణాభిముఖుండై యరుగునప్పుడు, నిజాన్వయజాతుండైన హేమాంగదమహీపాలునకు గమననివారణకారణం బైనయంధకారంబు దూరంబు సేయ నుత్సహించుచందంబున.

66


సీ.

కైసేసి పూర్యదిక్కామినీమణి చూచు
        పద్మరాగంపుదర్పణ మనంగ
వేయిగన్నులుగల వేల్పుతొయ్యలిచేతఁ
        జూపట్టుచెంబట్టుసురఁటి యనఁగఁ
విరహులపై దండు వెడలంగఁ దమకించు
        నసమాయుధుని కెంపు[1]టరిగ యనఁగ
గల్పకభూజశాఖాశిఖాగ్రంబున
        భాసిల్లు పరిపక్వఫల మనంగ


తే.

నభ్రమాతంగకులపతి యఱుతనొప్పు
కనకఘంటిక యనఁగ, లోకముల కెల్ల
నుదయరాగంబు రాగంబు నొదవఁజేయ
నిందుఁ డుదయించె లోచనానందుఁ డగుచు.

67


వ.

తదనంతరంబ.

68
  1. ధ్వజము