పుట:విక్రమార్కచరిత్రము.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమార్కచరిత్రము


చ.

పసిఁడిసలాకవోలెఁ గనుపట్టుతనుం గనుఁగొంచు, మన్మథ
ప్రసవశిలీముఖాలి కగపడ్డ మనోగతి నెట్టకేలకున్
వెస గుదియించి, చూపులచవిం బులకించుచు నున్నచోటఁ దా
ముసుఁగిడుకొన్న దింతి, నిజమూర్తిఁ గనుంగొననీనికైవడిన్.

36


వ.

అని వెండియు.

37


ఉ.

ఇంచుక ప్రొద్దుపోకడకు నెవ్వరితో నుబు సేమి చెప్పుదుం
బంచశరవ్యధం దలఁకు భావము నేగతిఁ గుస్తరింతు, నీ
చంచలచారులోచనఁ బొసంగఁగ నేగతి మూఁడుమాట లా
డించి కవుంగిలింతు, నని డెందములోఁ దలపోసి యంతటన్.

38


విక్రమార్కుఁడు దివ్వెగంబముచేఁ జెప్పించిన కామమంజరి కథ

ఉ.

దీనికిఁ జింత యేల యని తెల్వి మనంబునఁ బూని, కాంతిరే
ఖానవరత్నదీపకళికం దనరారెడు దివ్వెగంబముం
దా నొకనూత్నమంత్రమున దాఁకి సజీవను జేసి, దానితో
శ్రీ నెఱయంగ నొక్కకథ చెప్పఁగదె యని గారవించినన్.

39


క.

అయ్య యవుఁగాక యంచును
దియ్య మెసఁగ రాజుఁ జూచి దివ్వియగంబం
బియ్యకొని, యపూర్వపుఁ గథ
నెయ్యంబునఁ జెప్పఁదలఁచి నెఱి నిట్లనియెన్.

40


చ.

నరవర సావధానముగ నాదొక విన్నప మాలకింపు, ము
త్తరకురుభూములందు విశదంబుగ నాగపురం బనంగ న
త్యురుతరలక్ష్మి నొక్కపుర, మొప్పు నయోధ్యకుఁ బొమ్మ వెట్టి కి
న్నరపతిపట్టణంబు నగి నాగపురంబుఁ దృణీకరించుచున్.

41


మ.

విను మావట్టణ మాదిరాజవిలసద్విఖ్యాతి ధర్మధ్వజుం
డనుభూపాలకుఁ డేలుచుండును, జనాధ్యక్షుండు భూమీశ భూ
జనసంస్తుత్యుఁడు నిత్యసత్యుఁ డురుసౌజన్యుండు ధన్యుండు స
త్త్వనయప్రాభవధీవిధేయుఁడు గుణాధారుండు ధీరుం డిలన్.

42