పుట:విక్రమార్కచరిత్రము.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

209


కామసౌధోపరికనకకుంభములకు
        రమణియురోజకుంభములు చెలులు
దివిజాధిపతిదంతితిన్ననినడపున
        కంగననడవు విహారభూమి


తే.

తెఱవయధరంబు పవడంపుఁ దీవెయురపు
పడఁతియలకము లళులకుఁ బ్రాణసఖము
లింతిచూపులు మగమీల నేలఁ గోరుఁ
దరుణిపలుకులు కాముమంత్రములగములు.

25


చ.

కలువల గండుమీలఁ దొలుకారు మెఱుంగుల నిండువెన్నెలన్
వలవులరాజుతూపులగు వారిరుహంబుల, నొక్క యెత్తునన్
గెలుపుకొనంగఁ జాలు మృగనేత్ర యపాంగనిరీక్షణద్యుతుల్
బలుపుగ ధైర్యమూలమున పాఁ తగలింపవె యీశ్వరాదులన్.

26


సీ.

ముద్దులు దొలఁకాడు ముద్ధియపలుకు ల
        య్యసమాస్త్రుమంత్ర బీజాక్షరములు
క్రొమ్మెఱుంగులనీను కోమలిచూపు ల
        య్యంగసంభవు వాలుటంపగములు
శృంగారరసమొల్కుచెల్వయాకారంబు
        కామునివలపులకత్తె కనుఁగు
ఇంపులు వెదచల్లు నేణాక్షిచెయ్వులు
        శంబరాంతకు జయసాధనములు


తే.

కాంతమెయికాంతి కంతునిఖడ్గకాంతి
వనజముఖకురుల్ రతిపతి వాగురములు
మగువమురిపంబు మరునిసామ్రాజ్యపదము
చెప్పఁ జిట్టలు పూఁబోడి యొప్పుకలిమి.

27


తే.

సుదతినునుఁబల్కులమృతంపుసొన గురియుఁ
దరుణిచూపులు మెఱుఁగుమొత్తముల నీను
రమణిసేఁత లనంగతంత్రముల నెఱుపు
నువిదనడపులు హంసల కొఱపు గఱపు.

28