పుట:విక్రమార్కచరిత్రము.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

207


మ.

అని యానందమరందకందళితవక్తాంభోజుఁడై యోగిరా
డ్జననాథుండు ప్రశంస సేయుటయు, నాసర్వంసహాధీశ్వరుం
డనఘా! నీదుకటాక్షవీక్షణము నాయం దందమై చెందెఁ గా
న నవీనప్రథమానభాగ్యమయధన్యత్వంబు నేఁ గాంచితిన్.

12


ఆ.

అనుచు శిష్యసహిత మమ్మహాయోగీంద్రు
గారవించి కొలువువారి ననిచి
మనుజనాయకుండు మజ్జనభోజన
క్రియల వారికెల్లఁ బ్రియ మొనర్చె.

13


వ.

వారలుం దానును సుఖాసీనులై యున్నయవసరంబున యోగీశ్వరునకు విశ్వంభరాధీశ్వరుం డిట్లనియె.

14


క.

ఎన్నిక కెక్కినదేశము
లన్నియుఁ జూచితిరి కరతలామలకముగా
నిన్నిటిలోపలఁ జోద్యము
కన్నది విన్నదియు నొకటి గలిగినఁ జెపుఁడా.

15


వ.

అనవుడు.

16


చ.

జనవర నీయెడం బ్రియము చాలఁగఁగల్గి, యపూర్వపుం బ్రయో
జన మెఱఁగింతు నన్యులకు సాధ్యము గానిది, లాటభూమిఁ గా
ననమునఁ బుట్టమీఁద నొకనాతుక, కోమలబాహువల్లి య
త్యనుపమకంకణాంకితసమన్వితమై కనుపట్టు నెప్పుడున్.

17


వ.

అనిన నమ్మహీకాంతుం డక్కాంతవృత్తాంతం బాద్యంతం బెఱింగింపుఁడనిన నా సిద్ధవరుం డిట్లనియె.

18


చ.

భుజగజగద్విభూషణము పుష్పవురం, బది యేలురాజు చి
త్తజనిభమూర్తి కీర్తివనితారమణుండు ధనుంజయాఖ్యుఁ డా
సుజననుతప్రతాపుఁ డతిశోభనగానకళానిరూఢి శై
లజ నలరించి, తత్కృపఁ గళావతిఁ గాంచెఁ గళావిశారదన్.

19