పుట:విక్రమార్కచరిత్రము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

విక్రమార్కచరిత్రము

షష్ఠాశ్వాసము

శ్రీమేళనగుణఖేలన
సామాదికచతురుపాయచాతుర్యనిధీ
స్వామిహితకార్యఘటనా
సౌముఖ్య జగత్ప్రసిద్ధ జన్నయసిద్ధా.

1


సీ.

విభవంబు పొలువున విలువిద్యబలుపున
        బురుహూతుఁ దత్సుతుఁ బోలు ననఁగ
సత్ప్రభపెంపునఁ జాగంబుసొంపున
        మిత్త్రుఁ దత్పుత్త్రుని మీఱఁ ననఁగ
రాజరాజవిభూతి రతివిహారఖ్యాతి
        ధనదుఁ దత్సూనుని నెనయు ననఁగ
గంభీరతాస్ఫూర్తి ఘనకాంతిమయమూర్తి
        శరధిఁ దదాత్ముజు దొరయు ననఁగ


తే.

నిరతసేవాగతాగణ్య నృపవరేణ్య
నుతకిరీటాగ్రకీలితనూత్నరత్న
కిరణనికరారుణారుణచరణుఁ డగుచు
విక్రమాదిత్యవసుమతీవిభుఁడు మెఱసె.

2


వ.

అమ్మహీపతి యొక్కనాఁడు సకలప్రధానదండనాథసామంతమండలేశ్వరసమూహంబును, గురుభూసురపురోహితబంధుమిత్త్రపుత్త్రపౌత్త్రప్రకరంబును, గవిగాయకపాఠకవైతాళికసందోహంబును బరివేష్టింప, మణిగణభూషణప్రభాపటలశోభితాంగుండై మౌక్తికహారంబునడిమి నాయకరత్నంబునుంబోలెఁ దేజరిల్లుచు, మణిమయోన్నతభద్రసింహాసనాసీనుండై పేరోలగంబున్న సమయంబున.

3