పుట:విక్రమార్కచరిత్రము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

విక్రమార్కచరిత్రము


నతని కాయూళ్ళవార లాహార మెపుడు
బండిఁ గొనిపోయి పెట్టుదు రొండొకండ.

204


వ.

వాఁ డన్నరమహిషసహితంబుగాఁ దదన్నంబు భజించుచుండు.

205


క.

ఇలువరుసగాఁగ నీక్రియఁ
గలవారల నెల్లఁ బుచ్చెఁ గాలునిపురికిన్
ఖలుఁ డగునారాక్షసుండా
కులపడుఁ ద్రిజగంబు నతఁడు కుపితుండైనన్.

206


ఉ.

ఏమని చెప్పుదున్ ఖగకులేశ్వర! నాసఖుఁ డొక్కభూసుర
గ్రామణి చావఁగాఁ గలఁడు రాక్షసుచేఁ, నది మాన్పఁ ద్రోవలే
దేమెయిఁ జూచినన్ హితులయిష్ట మొనర్పఁగ లేనినాభవం
బేమిభవంబు! దీనికిని నే దురపిల్లెద నేమి సేయుదున్.

207


వ.

అనిన నే నిట్లంటి.

208


క.

నరులకుఁ బక్షులకును నె
ప్పరుసున సమకూరు మిత్రభావం, బిది య
చ్చెరువు, వినవలతు నా కిది
పరిపాటి నెఱుంగఁ జెప్పు బంధునిధానా.

209


వ.

అనినఁ గంకాళఖండనుం డిట్లనియె.

210


క.

నాచుట్టంబులు నేనును
వే చని యశనార్థ మడవి విహరింపంగాఁ
జూచి మముఁ బట్టఁ దిరిగెడు
నీచుఁ డొకఁడు మాచరించునెల వెఱిఁగి తగన్.

211


క.

మచ్చు లిడి యురులు బోనులు
నచ్చట వెస నొగ్గి చనిన నది యెఱుఁగక యా
మచ్చుచ్చురులను బడి వగ
నిచ్చను దురపిల్లుచున్నయెడ నచ్చటికిన్.

212