పుట:విక్రమార్కచరిత్రము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

విక్రమార్కచరిత్రము


ననిన విక్రమాదిత్యుఁ డట్లయిన నీవు
నాకుఁ బ్రియముగ నొకటి యొనర్పవలయు.

192


క.

లోకవిలోచనకైరవ
రాకాచంద్రుం డితండు, రమణీమణి నీ
వీకమలాకరుఁ బ్రియుఁగాఁ
గైకొను మిది నాకుఁ బ్రియము కమలదళాక్షీ!

183


వ.

అని యయ్యిరువురం గూర్చి యజ్జననాథుం డుజ్జయినీపురంబునకుం జని, దుష్టనిగ్రహశిష్టప్రతిపాలనంబులు సహజఖేలనంబులుగా ననయంబును సర్వంసహానిర్వహణదుర్వారభుజాగర్వఖర్వేతరుండై రాజ్యంబు సేయుచుండి, జగంబున నత్యాశ్చర్యభరితంబులైన చరితంబు లెఱుంగవేఁడి కర్ణావతంసీకృతకౌక్షేయకసహాయుండై చని యొక్కరుండును బెక్కుదిక్కులం జరియించుచు నొక్కనాఁడు.

194


విక్రమార్కుఁడు రక్షసునిచే మనుజవధ మాన్పించుట

క.

పేరడవిలోన రాఁగా
నీరజహితుఁ డస్తమించి నెఱనఖిలాళా
పూరితమై తమ మెచ్చెను
భూరివదాన్యులవితీర్ణిఁ బోల్పఁగఁ బట్టై.

195


క.

ఆచీఁకటి నొక్కండును
ద్రోచిచనఁగ రామి, ననతిదూరంబున వా
గ్గోచరము గానియున్నతి
నేచినవటవిటపినీడ నెలమి వసించెన్.

196


వ.

అట్లున్నసమయంబున.

197


క.

ఆవిటపి నుచితవచన
ప్రావీణ్యము మెఱయ నున్నపక్షులకుఁ జిరం
జీవి యనువిహగముఖ్యుఁడు
కోవిదబహుమాననీయగుణుఁ డిట్లనియెన్.

198