పుట:విక్రమార్కచరిత్రము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

విక్రమార్కచరిత్రము


క.

కాంచెం గాంచీపురముం
గాంచనమణిసౌధసాలఘనగోపురముం
జంచలనయనానటనస
మంచితపర్యటనరణితమణినూపురమున్.

179


వ.

కాంచి యందు నయ్యిందువదనమందిరంబునకుఁ గమలాకరమహీసు రోపదిష్టమార్గంబునం జని యజ్జనవరుండు.

180


క.

నరమోహనవిలసనముల
మరుమోహనశరముకంటె మధురాకృతియై
నరమోహిని యనఁదగియెడు
నరమోహినిఁ గాంచి మనుజనాథుఁడు మదిలోన్.

181


ఉ.

ముప్పిరిగొన్న వేడ్క నరమోహినిపై నెలకొన్న జూపులం
ద్రిప్పఁగలేక యీమదవతీరమణీయతప్రాపున న్మరుం,
డప్పరమేశపద్మనయనాంబుజగర్భులనైన వ్రేల్మిడిం
ద్రిప్పులబెట్టు, నంచు వినుతించి మదిం దిలకించి వెండియున్.

182


ఆ.

ఈవధూటిరూపయౌవనసంపద
కాముకులకు లోచనామృతంబు
చిత్రగతి మృతంబు సేయుచునున్నది
కనకపాత్రలోనిగరళ మట్లు.

183


వ.

అని తలంచుచున్న యవసరంబునం గమలాకరుం డాకమలానన కిట్లనియె.

184


ఉ.

ధీరుఁడు విక్రమార్కజగతీతలనాథుఁడు నిన్నుఁ జూచు ని
చ్ఛారతి వీఁడె వచ్చె ననఁ జాగిలి మ్రొక్క ప్రియోక్తి నిట్లనుం
గ్రూరనిశాచరుం డొకఁడు కూరిమి నాయెడఁ గల్గియుండు, సం
హార మొనర్చు వచ్చినవిటావళిఁ దన్నిశ నొక్కవ్రేల్మిడిన్.

185