పుట:విక్రమార్కచరిత్రము.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

విక్రమార్కచరిత్రము


తే.

కాంచి యేలెడుజయసేనుఁ గాంచి, యతఁడు
నన్ను మన్నింప నందుఁ గొన్నాళ్లు నిలిచి
యొక్కనాఁ డేను బొడగంటి నొకవధూటి
నావిలాసిని చెలువ మేమని నుతింతు.

169


సీ.

పొలఁతి వేనలితోడఁ బురినెమ్మి తనపురి
        ప్రతివచ్చునని పాముఁబట్టెనేని
యింతినెమ్మోముతో నెనయుదునని వార్థి
        పట్టి విష్ణుపదంబు ముట్టెనేని
చామచన్నులతోడ సరివత్తుమని కోక
        ములు దండగుండాన మునిఁగెనేని
యతివమై దొరయుదునని సువర్ణశలాక
        వహ్నిలోపలఁ జొచ్చి వచ్చెనేని


తే.

నిక్కువంబుగ నమ్మంగనేర కజుఁడు
శుద్ధపట్టంబు గనుటకుఁ జొరక మానె
ననిన నయ్యంబుజాకాయతాక్షితోడ
నితరవనితల నుపమింప నెట్లువచ్చు?

170


క.

ఆయంగన క్రేఁగన్నుల
యోయారపుఁగలికిచూపుటురులం బడినం
గాయజునిచిత్తమైనను
గాయజసంతాపవహ్నిఁ గరఁగక యున్నే.

171


సీ.

చంద్రబింబముఁ బాలసంద్రంబులోఁ దోఁచి
        కందెల్లఁ బోఁ బులు కడుగకున్నఁ
గామబాణంబులఁ గరసానఁబట్టించి
        తొలుకారుమెఱుఁగునఁ దొడయకున్నఁ
బసిఁడిసలాకకుఁ బరిమళం బొనగూర్చి
        గరువంపువెన్నెలఁ గరఁగకున్నఁ