పుట:విక్రమార్కచరిత్రము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

విక్రమార్కచరిత్రము


చ.

అనినఁ బ్రమోద మంది వసుధామరవర్యునిఁ గూడి విక్రమా
ర్కనృపవరేణ్యుఁ డాత్మనగరంబునకుం జనియెన్, ద్విజుండునుం
దనసదనంబు చేరెఁ బ్రమదమ్మున నమ్మఱునాడు పిల్చి, య
జ్జనపతి దేవదత్తునకు సమ్మతి నిచ్చెఁ బురోహితత్వమున్.

142


వ.

ఇచ్చి యొక్కనాఁడు.

143


తే.

కలయఁగాఁ జూచి కొల్వులోఁ గల్గువారు
వినఁగ దేవదత్తుఁడు మొన్న విపినభూమిఁ
గోరి నాకుఁ జేసినయుపకారమునకు
మాఱు సేయ నెన్నఁడు సమకూఱు నొక్కొ!

144


వ.

అనిన నమ్మాటకు దేవదత్తుండు నృపోత్తమునియాసన్నవర్తిత్వంబునం జేసి, తనవర్తనం బఖలజనంబులు పరికీర్తనంబు సేయం బ్రవర్తించుచు నొక్కనాఁడు, సర్వాభరణభూషితుండైన రాజకుమారుండు ముంగిట నాడ ముద్దాడువాడునుంబోలె నెవ్వరు నెఱుఁగకుండ గూఢవృత్తి నెత్తుకొని నిజనివాసంబునకుం జనియె, నంత నక్కుమారు నెల్లవారు వెల్లెడల నరసి కానక ధాత్రీశ్వరున కత్తెఱం గెఱింగించిన, నతండును గుమారాన్వేషణంబునకుఁ దలవరుల నియోగించిన నయ్యారెకులు చని పురంబు సర్వంబును శోధించి, విపణివీథిం దదీయాభరణమ్ము లమ్మునమ్మహీసురు మచ్చంబుతోడం బట్టి తెచ్చి సమ్ముఖంబునం బెట్టిన, నమ్మహీపాలుం డుచితాలాపంబుల వెఱవు వాపి యడుగుటయు.

145


ఉ.

భూసురముఖ్యుఁ డిట్లనియె భూషణసంగ్రహణాభిలాషినై
యాసురవృత్తిఁ బూని భవదాత్మజుఁ జెప్పఁగరానిచేఁత నే
జేసితి, నావుడున్ సభ నశేషజనమ్ములుఁ గ్రూరదండితుం
జేసినఁగాక యీచెడుగు చేసిన సేఁత సహింపవచ్చునే?

146


క.

ఈభూషణంబు లెక్కడ
నాభూపకుమారుఁ డేడ నకటా! కృప లే
కేభంగిఁ దెగి వధించితి
వేభూములఁ జెప్పఁ గలరె యిట్టిదురాత్ముల్!

147