పుట:విక్రమార్కచరిత్రము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

181


చ.

పనిచిన సర్వసన్నహనబంధురుఁడై చనుదెంచి, యాతఁ డ
జ్జనపతికి న్నమస్కృతి ప్రసన్నతమై నొనరించి నిల్చి, యా
జనచరితార్థవిప్రవరసంఘముతోడఁ దదేకనిష్ఠమై
వెనుచన, నాహయంబు పృథివీవలయభ్రమణాభిలాషియై.

96


వ.

నిర్గమించినకతిపయదివసంబులకు సుమతిసుతసమీపంబుననుండి యొక్కజంఘాలుండు చనుదెంచి పురోపకంఠలీలావనభూమియందు సబలంబుగ నిల్చి భవత్ప్రధానుండున్నవాఁ డుర్వీశ్వరాతత్పరాక్రమధురీణత చెప్పం జిత్రం బని యిట్లనియె.

97


సీ.

సౌవీరభూపతి శరణుజొచ్చినఁ గాచె
        గాంధారరాజుచేఁ గప్పమందెఁ
గుంతలాధిపుకూర్మికూఁతులఁ గొనివచ్చె
        సౌరాష్ట్రవిభునిచేఁ బేరుకొనియెఁ
బాంచాలభూపాలుఁ బ్రతిరోపితునిఁ జేసెఁ
        గేరళాధిపుసూను గిఱవువట్టె
యవనక్షమానాథు నాజ్ఞావశునిఁ జేసె
        నంగక్షితీశున కభయమిచ్చె


తే.

జయము గైకొన్నపిదప నాసకలనృపుల
నుచితసంభాషణములచే నూఱడించి
యజ్ఞవేళకు రమ్మని యానతిచ్చి
నిగ్రహానుగ్రహాక్రియానిపుణుఁ డగుచు.

98


చ.

ధనదదిశామహేశ్వరవితానముచేత నుపాయనంబుగాఁ
గొనినవినూత్నరత్నఘనకుంజరఘోటకవారకామినీ
జనకనకాంబరాదుల నసంఖ్యములం గొనివచ్చినాఁడు, పెం
పెనయఁగ నన్యభూపతుల కిట్టిప్రధానులు గల్గ నేర్తురే!

99


సీ.

సవనాశ్వరక్షకై సగరనందను లేఁగి
        కపిలుకోపంబుచే గాసియైరి