Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జలయజ్ఞానికి స్ఫూర్తిప్రదాత అయిన సర్ ఆర్థర్ కాటన్ వారసులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించాలన్న డా॥ రాజశేఖరరెడ్డిగారి ఆకాంక్ష. నెరవేరకముందే వారు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసి తెలుగుజాతిని దుఃఖ సముద్రంలో ముంచెత్తారు.

డా॥ రాజశేఖరరెడ్డిగారి అభిలాష మేరకు సర్ ఆర్థర్ కాటన్ మునిమనుమడు శ్రీ చార్లెస్ రాబర్ట్ కాటన్‌ని ఆహ్వానించి అనుకున్న ప్రకారం కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య ఆదేశించారు. భారీనీటిపారుదల శాఖామంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ప్రాజక్టులను చార్లెస్ రాబర్ట్ కాటన్‌కు చూపించి సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తీరుని వారికి తెలియజెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.

2009 నవంబరు నెలలో 10 రోజుల పాటు చార్లెస్ రాబర్ట్ కాటన్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా రాష్ట్రమంతటా పర్యటించారు. గండికోట ప్రాజెక్టు నిర్మాణాన్ని చూసి, ఇడుపులపాయకు వెళ్లి, దివంగత రాజశేఖరరెడ్డిగారికి శ్రద్ధాంజలి ఘటించి,పులిచింతల ప్రాజెక్టును సందర్శించి, విజయవాడలో కృష్ణా డెల్లా రైతాంగ సన్మానాన్ని స్వీకరించారు. కాటన్ దంపతులు ఆ పిమ్మట గోదావరి బ్యారేజిని చూసి, రాజమండ్రిలో సన్మానం పొందారు. విశాఖపట్నంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చర్చిని సందర్శించి, విశాఖవాసుల ఘన సన్మానాన్ని అందుకున్నారు. యల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించి, హైదరాబాదు నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వారి సత్కారం అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ నారాయణ్ దత్ తివారిగారిని, ముఖ్యమంత్రి & శ్రీ కె. రోశయ్యగారిని కలిసి, వారిచే ఘన సత్కారాలను అందుకుని, రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి సర్ ఆర్థర్ కాటన్ పట్ల ఈనాటికీ గల చెక్కుచెదరని గౌరవాదరాలను ప్రత్యక్షంగా తిలకించి అబ్బురపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ పక్షాన మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఘన సన్మానం చేసి, భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనంతటికీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

76