పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుడు జె.పి.ఎల్. గ్విన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. తెలుగు అకాడమి స్థాపనలో విశేష సేవలందించారు. 1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో అంతర్జాతీయ తెలుగు సంస్థను నెలకొల్పవలసిందిగ శ్రీ గ్విన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

మా నాన్నగారు శ్రీ మండలి వెంకటకృష్ణారావుగారికి గ్విన్‍తో సత్సంబంధాలు ఉండేవి. నా వివాహానికి గ్విన్ దంపతులు విచ్చేసి ఆశీర్వదించిన మధుర జ్ఞాపకం నా మదిలో మెదులుతూ ఉంటుంది. మా నాన్న గారు లండన్ వెళ్లినపుడు, వారు వచ్చి కలిశారు. మేము లండన్ వెళ్లినప్పుడు 1999 సెప్టెంబరులో గ్విన్ పరమపదించినట్లు తెలుసుకుని విచారించాను. గ్విన్ మన మధ్య లేకున్నా, వారు తయారు చేసిన ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, ఆధునిక తెలుగు వ్యాకరణం తెలుగు భాషకు వారు అందించిన అమూల్యాభరణాలు. నా లండన్ పర్యటన ద్వారా వీరందరినీ ఒకసారి మనసారా గుర్తు చేసుకునే అవకాశం కలిగింది. లండన్లో డా॥ గోవర్ధన్‍రెడ్డిగారి ఇంట్లో మా బస. వారు ప్రసిద్ధ వైద్యులు; బ్రహ్మచారి. మా కోసం బర్మింగ్‍హామ్ నుంచి డా॥ జమలాపురం హరగోపాల్ వచ్చారు. నిజాం రాజ్యంలో ఆంధ్ర మహాసభ ప్రముఖులు, హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటయోధులు సర్దార్ జమలాపురం కేశవరావుగారి కుమారుడని తెలుసుకుని ఆనందించాను. వారి మామగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పద్మభూషణ్ డా॥ పాతూరు తిరుమలరావుగారు. డా॥ తిరుమలరావుగారితో సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు విద్యార్థి దశలోనే కలిగింది. డా॥ గోవర్ధన్‍రెడ్డిగారు మితభాషి. డా॥ హరగోపాల్ చక్కటి సరస సంభాషణాచతురులు. వారి ఆతిథ్యం మాకెంతో ఆత్మీయ పూర్వకంగా లండన్‍లో లభించింది. స్వగృహంలో ఉన్న సంతృప్తి డా॥ గోవర్ధన్‍రెడ్డిగారి ఇంట్లో కలిగింది.

లండన్ తెలుగు సంఘం అధ్యక్షులు డా॥ రాములు దాసోజు మమ్మల్ని విందుకు ఆహ్వానించారు. అక్కడే మరో మిత్రుడు శ్రీ కోట మల్లేష్‍తో కూడా