Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపం తెలుగు గడ్డకు వెలుగు నిచ్చింది. తెలుగు బిడ్డకు అన్నం పెట్టింది. గంగను స్వర్గం నుంచి భగీరథుడు భూతలానికి తెచ్చినాడన్న పురాణగాథ నిజమో కాదో కానీ, వృథాగా సముద్రం పాలైపోతున్న గోదావరీ జలాలను లక్షలాది ఎకరాల పంట పొలాలకు మళ్ళీంచిన అపర భగీరథుడు మాత్రం నిశ్చయంగా సర్ ఆర్థర్ కాటన్" అని శ్రీ నార్ల కొనియాడారు.

“సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు అంత కొద్దిపాటి వ్యయంతో (రూ. 15,34,000/-) నిర్మించిన గోదావరి ఆనకట్ట బ్రిటిష్ ఇండియాలోని ఇంజనీరింగ్ నైపుణ్యానికి అత్యద్భుతమైన చిహ్నంగా విశేష ప్రశంసలు పొందింది. 1846లో రాజమండ్రి జిల్లా జన సంఖ్య 5,61.041గా ఉండేది. 1891 నాటికి అది 20,78,782కు పెరిగింది. 1844లో రాజమండ్రి జిల్లా నుంచి లభించే అన్ని రకాల రెవెన్యూ రూ. 17,25,841/-లు ఉండేది. 1898 నాటికి ఒక ల్యాండ్ రెవెన్యూ మాత్రమే రూ. 60,19,224/-లకు పెరగింది. ప్రభుత్వ దృష్టితో చూసినపుడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టకు ఇంతకు మించిన యోగ్యతా పత్రం ఏమికావాలి" అని శ్రీ నార్లవారు ప్రశ్నించారు.

సుప్రసిద్ధ ఇంజనీరు మాజీ కేంద్ర జల విద్యుత్ శాఖామంత్రి శ్రీ కె.యల్. రావు "ఇండియాలో దక్షిణ దేశమున సర్ ఆర్థర్ కాటన్ నిర్వహించిన సేద్యపు నీటి పారుదల పనులకు కరవు కాటకాల బారి నుండి లక్షలాది ప్రజలు శాశ్వతంగా రక్షింపబడుటయే కాక, కృష్ణాగోదావరి డెల్లా ప్రాంతాలు అభివృద్ధి మార్గాన పయనించాయి. అతని కృషి ఫలితాలు కొండపై కోటవలె అందరికీ అగుపడుచున్నవి" అన్నారు.

కాటన్ పుణ్యమా అని ఈ రెండు ఆనకట్టలప్రాంత రైతులు పేదరికం నుంచి స్వంత సాగుకు ఎదిగారు. ఒక పటిష్టమైన మధ్య తరగతి రైతాంగం ఆవిర్భవించింది. సంపన్న వర్గానికి, పేదవర్గానికి నడుమ ఈ మధ్య తరగతి రైతాంగవర్గం అవతరించింది. రైతాంగ వర్గాలకు సాంఘిక హోదా సంపాదించడానికి, వారి సంతానాన్ని విద్యావంతులను చేయడానికి

67