పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చారిత్రకంగా కోహినూర్ ఎవరికి చెందుతుందన్న విషయం తేల్చడం కష్టసాధ్యమే. కానీ రత్నశాస్త్రపరంగా చూస్తే ఇది భారతదేశపు మట్టిలో పుట్టింది. కాబట్టి దీనిపై భారతదేశపు హక్కు ఎవరూ కాదనలేనిది.

ఏది ఏమైనప్పటికీ తెలుగుగడ్డపై పుట్టిన ఒక అనర్ఘరత్నం దేశదేశాలు తిరిగి, రాజ్యాధినేతల తలరాతలు మార్చి ప్రపంచ ప్రసిద్ధి పొంది, ఈ నాటికీ, ఏనాటికీ విలువ కట్టలేని అపూర్వ వస్తువుగా నిలిచి పోయింది.

దురానీ చక్రవర్తి షాషుజా భార్య బేగం షా చెప్పినట్లుగా డల్‌హౌసీ కోహినూర్ వజ్రం విషయంలో వ్రాసిన ఈ క్రింది వాక్యాలు అక్షర సత్యాలు :

ఒక బలిష్టుడైన వ్యక్తి ఐదు గులకరాళ్ళను తీసుకుని, తన శక్తి కొద్ది ఒక రాయిని తూర్పువైపుకు, ఒక రాయినీ పశ్చిమ దిశగా, ఒకటి ఉత్తర దిశగా, మరొకటి దక్షిణ దిశగా విసరిచేసి, ఐదవరాయిని తన తలపైకి వెళ్ళగలిగినంత ఎత్తుకు విసరగా, ఈ నాలుగు రాళ్ళు పడ్డ విస్తీర్ణంలో పైకి విసరిన రాయి వెళ్ళినంత ఎత్తులో ఈ ప్రపంచంలోని బంగారును, వజ్రాలను నింపితే కూడా ఆ సంపద విలువ కోహినూరు వజ్రానికి సరి సమానం కాలేదు".

మన మట్టిలో పుట్టిన అపూర్వమైన, అమూల్యమైన కోహినూర్ వజ్రాన్ని మనం దక్కించుకోలేకపోయినందుకు అపరిమితమైన బాధ, శతాబ్దాల పాటు ఎక్కడెక్కడో తిరిగి, మరుగునపడిపోకుండా చివరకు బ్రిటిష్ మహారాణుల కిరీటంలోస్థానం పొంది, లండన్ టవర్ మ్యూజియంలో సందర్శకులను అలరిస్తూ, తను పుట్టినగడ్డకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకు ఆనందం ఒక్కసారిగా నన్ను ముంచెత్తాయి.

ఈ కోహినూర్ వజ్రం తెలుగునాట లభించడం తెలుగువారుగా మనందరికీ గర్వకారణం. ప్రముఖ కవి తుమ్మల సీతారామమూర్తిగారి "తెలుగుతల్లీ! నీకు జోహారు, దేశమాతా! నీకు జోహారు" అనే గీతంలో -

"కొల్లూరి కోహినూరు కొప్పలో బూవటే
 కోలారు గనులు నీ కోశంబటే....."

అనే చరణాలు ఈ సందర్భంగా గుర్తుకొచ్చాయి.

★★★

52