పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింగ్ కోశాధికారి బలపరుస్తున్నా ఒరిస్సా ప్రభుత్వం ఈ వజ్రం జగన్నాథ స్వామిదనీ కాబట్టి దానిని తమకు అప్పగించాలని కోరింది.

1953లో క్వీన్ ఎలిజబెత్-II పట్టాభిషేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం మరోసారి కోహినూర్‌ను భారత్ కు అప్పగించమని కోరింది. అయితే నిజమైన పోరు 1976లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికల్ ఆలీ భుట్టో కోహినూరు పాకిస్తానుకు చెందుతుందని ప్రకటించడంతో ప్రారంభమైంది. ఆయన వాదన ప్రకారం రంజిత్ ఏలిన పంజాబ్ రాజధాని లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, కాబట్టి ఆ వజ్రం పాకిస్తాన్‌ది. ఈ వాదనను బ్రిటిష్ ప్రభుత్వం త్రిప్పికొడుతూనే, కోహినూర్ వజ్రాన్ని ఎవరికీ ఇచ్చేది లేదని, దీనిని ఏ యుద్ధంలోను బ్రిటన్ స్వాధీనం చేసుకోలేదని, దీనిని బహుమతిగా పొందడం జరిగిందని తమ ఉద్దేశ్యం తేల్చి చెప్పింది. అయితే పాకిస్తాన్ ఈ వాదనతో ఏకీభవించలేదు. పంజాబ్ రాజవంశీకుల నుంచి దీనిని ఒప్పందంలో భాగంగా స్వాధీనపరచుకున్నట్లు చరిత్ర చెబుతున్న విషయాన్ని గురు చేసింది. భారత్ ఈ వాదనను వ్యతిరేకిస్తూ, కోహినూర్ తమకే చెందుతుందని నొక్కి చెప్పింది. టెహరాన్లోని ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈ వజ్రం ఇరాన్‌కు చెందుతుందని ప్రకటించింది. డల్‌హౌసీ మునిమనుమడు ఒకడు ఇది డల్‌హౌసీ ఆధీనంలో ఒక సంవత్సరానికి మించి వున్నందున, ఈ వజ్రం ఆయన వారసుడుగా తనకే చెందుతుందని వాదించాడు.

బ్రిటిష్ పరిపాలనా దక్షులలో ఒకడుగా పేరుపొందిన సర్ ఓలాఫ్ క్యారో 'ది టైమ్స్' పత్రికలో ఈ విధంగా వ్రాశాడు. "కోహినూరు మొగలుల ఆధీనంలో 213 సంవత్సరాలు, ఆఫ్ఘన్ల ఆధీనంలో కాందహార్‌లోను, కాబూల్‌లోను 66 సంవత్సరాలు, బ్రిటిష్ వారి ఆధీనంలో” 127 సంవత్సరాలు ఉంది. బ్రిటిష్‌వారు దీనిని లాహోరు నుంచి స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమే. అయితే అంతకు ముందటి వారసులు కూడా ఇంకా వున్నారు. ఢిల్లీని పాలించిన మొగలులు వాస్తవానికి టర్కీ దేశస్తులు. బ్రిటిష్ వారు వజ్రాన్ని స్వాధీనం చేసుకునే నాటికి లాహోరును పాలించినవారు సిక్కులు. కాబట్టి దీనిని ఎవరికి తిరిగి ఇవ్వాలి అన్నది తేల్చడం కానిపని"

51