పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాచుకుంటాడని చెప్పింది. దాన్ని చేజిక్కించుకోవడానికి నాదిర్‌షా ఒక పథకం వేశాడు. ఒక విందు సమావేశం ఏర్పాటు చేసి, అందులో తమ స్నేహానికి గుర్తుగా తామిద్దరూ తలపాగాలు మార్చుకుంటామని ప్రకటించాడు. అప్పట్లో రాజులలో ఈ ఆచారం ఉండేది. అహ్మద్‌షాకు తలపాగా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అహ్మద్‌షా తలపాగాతో తన విడిదికి వెళ్ళిన నాదిర్ షా తలపాగా మడతల్లోని ఈ అమూల్య వజ్రాన్ని చూసి కోహినూర్ అని ఒక పొలికేక పెట్టాడట. "కోహ్-ఇ-నూర్" అంటే తేజః పర్వతం. ఒక పర్వతమంత వెలుగును ఈ వజ్రం ఇస్తుందని అతని భావన. అప్పటి నుంచీ ఈ వజ్రానికి "కోహ్-ఇ-నూర్" - కోహినూర్ అన్నపేరు స్థిరపడిపోయింది.

నాదిర్‌షాలో దురాశ పెచ్చరిల్లిపోయింది. ధనం కోసం తన-పర భేదం లేకుండా అందరినీ బాధించడం ప్రారంభించాడు. చివరికి తన మనుషుల చేతిలోనే 1747లో నాదిర్‌షా దారుణ హత్యకు గురయ్యాడు. కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారడం మొదలైంది. చివరికి ఆఫ్ఘన్ రాజ కుటుంబం వద్దకు చేరింది. 1810లో అహ్మద్‌షా అనే విప్లవ నాయకుడు రాచరికంపై తిరుగుబాటు చేశాడు. అప్పటి వరకు సింహాసనం కోసం పెనుగులాడుతూ ఒకరినొకరు పదవీభ్రష్టులను చేసుకుంటున్న ఆఫ్ఘన్ రాజకుమారులు మహ్మద్ షాషుజాలు ఇరువురూ దేశం వదిలి పారిపోయి 'పంజాబు సింహంగా పేరు పొందిన సిక్కు నాయకుడు రంజిత్‌సింగ్ శరణు జొచ్చారు.

షాషుజా వద్ద కోహినూర్ వజ్రం వున్న విషయం గ్రహించిన రంజిత్‌సింగ్ నయాన, భయాన అతని నుంచి ఆ వజ్రాన్ని 1813 జూన్ 1వ తేదీన రాబట్టుకున్నాడు. పంజాబ్ నేలిన బలీయుడైన సిక్కురాజులలో మొదటివాడు - చివరివాడు రంజిత్‌సింగే.

ఆయన తరువాత ఆయన కుమారులు ముగ్గురు ఒకరి తరువాత ఒకరు పంజాబును ఏలారు. వీరందరూ బలహీనులు; అందరూ అర్ధాంతరంగా చనిపోయినవారే. 1843లో రంజిత్‌సింగ్ చివరి కుమారుడు ధులీప్‌సింగ్ రాజ్యానికి వచ్చాడు. ఇతను మైనర్. ఇతని కాలంలో రెండు సిక్కు యుద్దాలు

45