పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఖరికి తన ఆశాదీపం, వంశాంకురం అయిన తన కుమారుడు అక్బర్‌ను కూడా వదులుకుని 20 సంవత్సరాలు గడపగలిగాడు కాని, ఆయన ఈ వజ్రం నుంచి మాత్రం ఎడబాటు పొందలేదు. ఆయనకు ఈ వజ్రంపై గల వ్యామోహానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఆయనకు ఆశ్రయం యిస్తున్న రాజ్యాధినేత ఈయన అశక్తతను సాకుగా తీసుకుని తనకు నమ్మకస్థుడైన ఒక వ్యక్తిని వజ్రాల వ్యాపారిగా హుమాయూన్ వద్దకు పంపాడు. అతడు తన వద్దనున్న వజ్రాన్ని కొనడానికి వచ్చాడని తెలుసుకొని హుమాయూన్ కోపోద్రిక్తుడై, "అటువంటి అమూల్య వజ్రాలను ఎవరూ కొనలేరు. వాటిని భగవదనుగ్రహం వల్ల లభించిన పరాక్రమంతో ఖడ్గ ప్రహరణ ద్వారా గెలుచుకోవాలి లేదా ఒక మహారాజు అనుగ్రహించి కానుకగా ఇవ్వాలి" అని చెప్పి ఆ వ్యక్తిని త్రిప్పి పంపాడు.

హుమాయూన్ రాజ్యభ్రషుడుగా తిరుగుతూ చివరకు పర్షియా చేరుకున్నాడు. పర్షియా రాజు షాతహమస్ ఈ మొగలాయి చక్రవర్తిని ఎంతో గౌరవాదరాలతో ఆహ్వానించి, ఆశ్రయమిచ్చాడు. షా తహమస్ ఆతిథ్యానికి ఉప్పొంగిపోయిన హుమాయూన్ ఆయనకు ఎన్నో అమూల్య రత్నాలను కానుకగా ఇచ్చాడు. అందులో "బాబరు వజ్రం" కూడా ఒకటని, అప్పట్లో ప్రముఖ చరిత్రకారుడు అబుల్ ఫజల్ వ్రాశాడు. ఈయన తదనంతర కాలంలో హుమాయూన్ కుమారుడు అక్బర్ షాదూషాకు కార్యదర్శిగా పనిచేసాడు. ఈయన వ్రాసిన "అక్బర్‌నామా"లో ఈ విషయం పేర్కొంటూ, ఈ వజ్రం ప్రపంచంలోని ఎన్నో దేశాల ఆదాయానికి సమానమని శాఘించాడు. హుమాయూన్ తనకు సమర్పించుకున్న రత్న సంపదను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన పర్షియారాజు, రత్న నిపుణులను రావించి వాటి విలువను మదింపు వేయమని కోరాడు. వాటిని పరిశీలించిన రత్న నిపుణులు, ఆ రత్నాలకు విలువ కట్టడం సాధ్యం కాని పని అని, అన్ని రత్నాలలోకి బాబరు వజ్రం తలమానికమని చెప్పారు. "ప్రపంచపు ఒకరోజు ఖర్చుతో సమానమైనదని చెప్పటం తప్ప "దీని విలువ ఇంత అని ఈ వజ్రానికి

41