పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వైద్యులేమి చేయలేకపోయారు. జబ్బు మరింత ముదిరింది. అప్పడొకరు హుమాయూన్ ప్రాణాలు కాపాడ్డానికిగాను బాబరు తనవద్దనున్న అమూల్య వస్తువును వదులుకోవలసి వుంటుందని సూచించాడు. తన కుమారుడి ప్రాణాలకోసం బాబరు ఈ వజ్రాన్ని తప్పక త్యాగం చేస్తాడని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోరాదని అతని ఉద్దేశం. అయితే, అతని అంచనా తప్పింది. ఈ వజ్రాన్ని వదులుకోవడానికి బాబరు ఇష్టపడలేదు. తన వద్ద నున్న అమూల్య వస్తువు తన ప్రాణాలేనని తెలియజేసి, జబ్బుపడివున్న హుమాయూన్ మంచం చుట్టూ తిరుగుతూ, హుమాయూన్ను రక్షించి, అందుకు ప్రతిగా తన ప్రాణాలు తీసుకోమని బాబరు భగవంతుణ్ణి ప్రార్ధించాడట. ఆ తరువాత హుమాయూన్ పరిస్థితి క్రమంగా మెరుగుపడిందనీ, దానితోపాటు బాబరు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమై, చివరకు ఆయన 1530 డిసెంబర్లో చనిపోయాడనీ చెబుతారు.

హుమాయూన్ పరిపాలన 26 ఏళ్ళపాటు సాగింది. అయితే మధ్యలో ఎన్నో అవాంతరాలు. తొమ్మిదిన్నర సంవత్సరాల మొదటి పాలన తరువాత షేర్ఖాన్ ఆఫ్ఘన్ సైన్యంతో ఇతనిని భారతదేశం నుంచి తరిమేశాడు. హుమాయూన్ మొదట సింధుకు వెళ్ళి, అటుపిమ్మట పర్షియా చేరుకుని 15 సంవత్సరాల వరకు భారత్‌కు తిరిగి రాలేదు. తిరిగి అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆయన పాలన ఆరు మాసాలకు మించి సాగలేదు. ఒక రోజు మసీదు నుంచి ప్రార్థనకు పిలుపువిని, ఒక్క ఉదుటున లేచి, తన గ్రంథాలయం మెట్ల విూద నుంచి, బహుశః నల్లమందు ప్రభావంతో, తలక్రిందులుగా పడిపోయి, చనిపోయాడు.

ఆఫ్ఘనుల చేతిలో రాజ్యభ్రష్టుడై దేశం వెలుపల తిరుగుతుండిన కాలంలో హుమాయూన్ తన తండ్రి ఆగ్రాలో తనకు తిరిగి ఇచ్చిన ఈ అమూల్య వజ్రాన్ని మాత్రం తనతోనే ఉంచుకున్నట్లు చారిత్రకాధారాలున్నాయి. అప్పట్లో రెండువందల సంవత్సరాల పాటు ఈ వజ్రం "బాబరు వజ్రంగా" పిలవబడేది. రాజ్యాన్ని ఒక్కగానొక్క ముద్దుల కుమార్తెను, అసంఖ్యాకంగా వున్న భార్యలను,

40