పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దివ్యరత్నమిది. ఈ వజ్రం యొక్క ప్రభావానికి సమ్మోహితులైన ఎందరో రాజన్యులు, చక్రవర్తులు దీనిని స్వంతం చేసుకోవడానికి తహతహలాడారు. ఈ వజ్రం కోసం యుద్ధాలు చెలరేగి, రక్తపాతం జరిగింది. బంధుత్వాలు, రక్త సంబంధాలు మరచి ఒకరినొకరు మోసం చేసుకున్నారు. హత్యలు చేశారు. తీవ్రమైన హింసలకు గురయ్యారు. దీన్ని రక్షించుకోవడానికి పడ్డ తపనలో ఎంతో మానసిక వేదన అనుభవించారు. శతాబ్దాల తరబడి చేతులు మారుతూ, ఈ వజ్రం చేసిన బహుదూర ప్రయాణం ఎంతో ఉద్విగ్నభరితం. ఈ వజ్రం చుట్టూ ఎన్నో చరిత్రలు తిరిగాయి. కథలూ, గాథలూ, కల్పనలూ అల్లుకున్నాయి. ప్రపంచంలో ఏ వజ్రానికి దక్కని ప్రత్యేకతను స్వంతం చేసుకున్న ఈ అనర్ఘరత్నం జన్మస్థానం ఆంధ్రదేశం!

ఈ వజ్రం గుంటూరు సీమలోని సత్తెనపల్లి తాలూకా కొల్లూరు గ్రామంలోని ఒక వజ్రపుగనిలో దొరికిందని అబ్దుల్ అజీజ్గారు "Journal of Indian Hisotry" అనే చారిత్ర విషయిక పత్రికలో వ్రాసిన వ్యాసం కలకత్తాలో మోడరన్ రివ్యూలో ప్రకటించబడింది. ఈ వ్యాసాన్ని 1938లో భారతి మాసపత్రిక — సంపుటం-10లో అనువదించి ప్రచురించారు.

ఈ వజ్రం ఐదువేల సంవత్సరాల నాటిదని భారతదేశ సంప్రదాయ చరిత్రలో ప్రచారం ఉన్నమాట వాస్తవమని, అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడం లేదనీ పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. లభిస్తున్న చారిత్రకాధారాల ప్రకారం ఈ వజ్రం ప్రస్తావన మొగల్ చక్రవర్తి బాబర్ తన జ్ఞాపకాలను 'బాబర్ నామా' పేరుతో వ్రాసుకున్న గ్రంథంలో ఉంది. బాబర్‌నామాలో ఈ విధంగా ఉంది. క్రీ.శ. 1300ల ప్రాంతంలో మాళవ (ప్రస్తుత గుజరాత్) రాజవంశం చాలా బలంగా ఉంది. నర్మదా నదికి వింధ్యపర్వతానికి మధ్యగల భూభాగాన్ని అప్పటికి వెయ్యి సంవత్సరాల బట్టీ వీరు పాలిస్తున్నారు. వీరు మహ్మదీయులకు గట్టి ప్రతిఘటన ఇచ్చారు. అయితే 1295 నుంచి 1316 వరకు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖల్జీ తాను రాజ్యపాలనకు రావడానికి ఒక సంవత్సరం ముందు దక్కన్ పై దండయాత్ర చేసి, నర్మద, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్యభాగాన్ని

37