పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి శిల్పకళాఖండాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలను ఓరియంటల్ యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్కు చెందిన డగ్లాస్ ల్యారట్ 1954లో ప్రచురించారు. ఈయన ప్రచురణ విడివిడిగా ఒక్కొక్క రాతి పలక గురించిన వివరాలతో కూడి ఉంది. ఈ ప్రచురణలో శిల్పాల వివరాలతో పాటు దక్కన్ చరిత్ర, కళాఖండాల సేకరణ చరిత్ర, స్తూపమూ, శిల్పులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా ఉన్నాయి. 1942లో మద్రాసులోని కళాఖండాలకు సంబంధించిన వివరాలతో వచ్చిన శివరామమూర్తి ప్రచురణకు ఇది అన్ని విధాలా సోదరతుల్యం.

ప్రాచీన సంస్కృతులుగా భాసిల్లుతున్న ఈజిప్ట్, మెసపొటేనియా, మెడిటేరియన్ నాగరికతలకు సమాన స్థాయిలో అమరావతి శిల్పాలు నిలుస్తాయి. ఈ శిల్పాలను చెక్కిన విధానం ప్రాచీన భారతీయ సాంస్కృతిక సంపదను మాత్రమే కాక ప్రస్తుత భారతీయ జీవన విధానాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. సహజ సౌందర్యంతో అలరారుతున్న అమరావతి శిల్పాలు సరిహద్దులను చెరిపివేపి ప్రపంచ ప్రజలందరిని తమ వైపు ఆకర్షింపజేస్తూ, భారతీయ కళా సంస్కృతులను పరిచయం చేసూ, ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వాన్ని దిద్దిగంతాలకు పరివ్యాప్తి చేస్తున్నాయి.

అమరావతి శిల్పి స్వతంత్రుడై అటు ప్రకృతిని ఇటు మానవ చిత్తవృత్తిని మనోజ్ఞమైన శైలిలో సృష్టించాడు.

అలంకార శిల్పాలు, రేఖలూ, వలయాలూ, చతురములు ఎన్నో విధాలుగా చిత్రించబడినవి. ఇవికాక తామర తీగలు, పుష్ప గుచ్చాలు సాక్షాత్కరిస్తాయి.

మిథున శిల్పాలలో - స్త్రీ పురుషులు అనేక భంగిమలలో బహు విధములైన శృంగార చేష్టలలో నిమగ్నులయి ఉంటారు. ఆంధ్ర శిల్పుల ఉలి శృంగార రస చిత్రీకరణలో మహా కావ్యాలను తలదన్నినట్లు తోస్తుంది.

శిల్ప రూపంలో పోతపోసి లోకోత్తర కళాసృష్టి చేశాడు నాటి ఆంధ్ర శిల్చి బ్రిటిష్ మ్యూజియంలోని అపురూప శిల్పాలలో కొన్నిటిని ఇక్కడ పరిచయం చేస్తాను.