భారతీయ ప్రాచీన మహోన్నత శిల్ప కళా వారసత్వానికి గుర్తుగా అమరావతి శిల్పాలు మరొకమారు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
మద్రాసు ప్రభుత్వ మ్యూజియంలో మొదట 1850లో అమర్చబడి, ఆ తరువాత బ్రిటిష్ మ్యూజియానికి తరలింపబడిన ఈ శిల్పాలను మ్యూజియం సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ బల్ ఫోర్ ఆదేశాలమేరకు కాప్టెన్ ట్రైస్ ఫొటోలు తీయడం జరిగింది. ఈ ఫొటోలను ఏ రకమైన వ్యాఖ్యలేకుండా 1858లో మద్రాసు మ్యూజియంలో ఇలియట్ మారబుల్స్ అన్న పేరుతో ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం ఇదొక అపురూపమైన ఆల్బమ్. ఉపరితలం దెబ్బతిన్న శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయడానికి ఈ ఫొటోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ అద్భుత కళాఖండాలను ప్రజా బాహుళ్యానికి పరిచయం చేసిన బల్ఫోర్ కు, కాప్టెన్ ట్రైస్ కు మనం సర్వదా ఋణపడి ఉంటాము.
1859లో ఈ శిల్పాలు బ్రిటన్ కు వచ్చినప్పటి నుంచీ ఇవి రెండు ప్రముఖ ప్రచురణల్లో చోటు చేసుకున్నాయి. మొదటిది జేమ్స్ ఫెర్లుసన్ ప్రకటించిన "వృక్ష-సర్ప ఆరాధన". ఈ బృహత్ ప్రచురణలో సాంచి శిల్పాలను గురించి, అమరావతి శిల్పాలను గురించి విస్తారంగా చర్చించడమైంది. భారతీయ శిల్ప సంపదపై వెలువడ్డ మొట్టమొదటి పరిశోధనాత్మక ప్రచురణ ఇది. ఇండియా ఆఫీసు ఆధీనంలో ఉన్న ఈ కళా ఖండాలకు అద్భుతమైన స్పష్టతతో ఫొటోలను తీసి, ఈ శిల్పాలకు సంబంధించిన అన్ని వివరాలను ఇస్తూ, బౌద్ధమతం గుఱించి వివరణ ఇవ్వడం జరిగింది. కళాఖండాలను దేనికది విడివిడిగాను, ఏ పలకకు ఆ పలకగా ఫొటోలు తీయడమైంది. అయితే ఎంట్రీ ఫారాల గురించి చెప్పలేదు.
ఫెర్గుసన్ ఈ ఫొటోలను మరింత అద్భుతంగా కూర్చి పలకలను అందంగా పేర్చి వివరణాత్మకమైన వ్యాఖ్యానాన్ని వాటికి ఇచ్చారు. ఆయన చేసిన ఈ పని ఆ తరువాత ఎన్నో తరాల వరకు ఎవరూ చేయలేని పనిగా నిలిచిపోయి, బ్రిటిష్ మ్యూజియంలోని కళాఖండాలకు సాధికారికమైన సమాచారంగా ఉండిపోయింది.