పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేసిన కీర్తి ఫ్రాంక్స్‌కు ఫెర్గుసన్‌కు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

1939లో యుద్ధం మంచుకొస్తున్న తరుణంలో అమరావతి శిల్పాలను విడదీసి, ఒక సురక్షిత ప్రదేశంలో భద్రపరచడం జరిగింది. 1951-52 సంవత్సరంలో తిరిగి మ్యూజియంలోని ముందు హాలులో వాయవ్యభాగంలో ప్రస్తుతం గిఫ్ట్ షాపు ఉన్న ప్రదేశంలో ఈ శిల్పాలను అమర్చడం జరిగింది. పైకప్ప, డోలు ఆకారంతో ఉన్న రాళ్లను పశ్చిమపు గోడకు అమర్చి కుడ్య చిత్రాలున్న పలకలను వాటి ముందు బిగించడం జరిగింది. ఈ పద్ధతి అప్పట్లో వాడులోకి వస్తున్న ప్రదర్శనా విధానానికి అనుగుణమైంది. అయితే ఆ తరువాత ఆ రాళ్ల బరువు దృష్ట్యా, వాటికవిగా అంత బరువును మోయలేవని గ్రహించడం వల్ల, వాటి బరువును ఆపడానికి స్టీల్ ఫ్రేమ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

1950 నాటికి శిల్పాల ఉపరితలం స్వల్పంగ శిథిలమవుతున్నట్లు గుర్తించడమైంది. లండన్లో ఉన్న శిల్పాలను బ్రిటిష్ మ్యూజియం రీసెర్చ్ లాబరేటరీలోను, భారతదేశంలో ఉన్న శిల్పాలకు ప్రభుత్వ కెమిస్ట్ చేతను రసాయన పరీక్షలు నిర్వహించడం జరిగింది. సున్నితమైన, మృదువైన పాలరాళ్లు వాతావరణంలోని వేడి మూలంగాను, ఇతర కాలుష్యాల మూలంగాను దెబ్బతింటున్నట్లు గుర్తించడమైంది. ఈ దురదృష్టకర పరిస్థితి ఈ రాళ్ళను తిరిగి విడదీసి, వాతావరణ కాలుష్యం ఉండని, ఎయిర్ కండిషన్స్ ఎయిర్ ఫిల్టర్ భూగర్భ మందిరంలో ఉంచడానికి దారి తీసింది. అందువల్ల 1960 నుంచి ఇవి సందర్శనకు నోచుకోలేదు. అపుడపుడు అతి తక్కువ సంఖ్యలో ప్రముఖ సందర్శకులను, పరిశోధకులను ఈ శిల్పాల అధ్యయనానికిగాను అనుమతించడం జరిగింది.

ఓరియంటల్ గ్యాలరీని కింగ్ ఎడ్వర్డ్ భవనానికి మార్చిన పిమ్మట అమరావతి శిల్పాలను సాధ్యమైనంత వరకు తిరిగి ప్రదర్శనకు ఉంచాలని మ్యూజియం ట్రస్టు నిర్ణయించడమైంది. "అసాహిషింబుల్" అనే జపాన్ వార్తా పత్రిక యాజమాన్యం ఈ ఆలోచనను ఎంతో ఉదారంగా సార్ధకం చేసింది.