పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత ఇవి అలగ్జాండర్ అన్న వ్యక్తి హస్తగతమయ్యాయి. ఇతని గురించి కూడా ఏమీ తెలియడం లేదు. ఈయన వాటిని తన ఉద్యానవనంలో పెట్టుకున్నాడు.

1845లో మద్రాసు సివిల్ సర్వీసుకు చెందిన సర్ వాల్టర్ ఇలియట్ అమరావతిని సందర్శించే నాటికి, మహాస్తూపం దిమ్మె పూర్తిగా అంతర్ధానమై పోయింది. ఆయన చూసే నాటికి స్తూపాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, యధేచ్ఛగా స్తూపం అడుగు భాగాన్ని త్రవ్వి, లభించినంత వరకు రాళ్లను పెకలించి తీసి, కాల్చి సున్నంగా మార్చేశారు. ఒకప్పడు అక్కడొక మహా కట్టడం ఉండేదని చెప్పడానికి గుర్తులు మాత్రం మిగిలాయి.

ఇదంతా గమనించిన ఇలియట్ ఆ ప్రాంతంలో త్రవ్వకాలకు ఆదేశించాడు. స్తూపానికి వాయవ్య భాగంలో ఇలియట్ త్రవ్వకాలు జరిపించి దాదాపు 79 శిల్పాలను వెలికి తీశాడు. అయితే వాటికి సంబంధించిన వివరాలు ఎక్కడా వెల్లడించబడలేదు. పరిపూర్ణత లేని డ్రాయింగ్‌లు,శిల్పాలను గురించిన చిత్తు ప్రతులు కొన్ని ఇలియట్ త్రవ్వకాలకు సంబంధించినవి బ్రిటిష్ మ్యూజియంలో లభిస్తున్నాయి. ఇలియట్ త్రవ్వకాల తరువాత ఈ ప్రదేశం 1845 నుంచి 1877 మధ్యకాలంలో, స్వెల్ మళ్ళీ త్రవ్వకాలకు పూనుకునే వరకు పూర్తిగా విస్మరించబడింది.

త్రవ్వి తీసిన రాళ్లను మద్రాసుకు తరలించి, మద్రాసు కాలేజి ఆవరణలో అశ్రద్ధగా ఎండవానలకు వదిలి వేశారు. 1858లో వాటి గురించి విచారించిన కోర్టు డైరెక్టర్లు ఈ రాళ్లను సెంట్రల్ మ్యూజియానికి తరలించారు. అప్పటికే ప్రచండభానుడి ప్రతాపానికి గురైన శిల్పాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. 1856లో ప్రభుత్వ సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ బల్ఫోర్ చొరవతో రెవరెండ్ విలియం టేలర్ వాటికి నంబర్లు ఇచ్చి కేటలాగులోకి ఎక్కించాడు. టేలర్ జాబితా ప్రకారం ఇవి 79. ఇందులో నుంచి రెండు రాళ్లు పోయాయి. వాటికి మచిలీపట్నం నుంచి తెచ్చిన 37 రాళ్లను కలిపారు. ఏడ్వర్డ్ బల్‌ఫోర్ ఈ రాళ్లను మద్రాసు మ్యూజియంలో తొమ్మిదేళ్లు భద్రపరిచాడు.