పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వున్న శిల్పాలను చెక్కి పలకలను చదును చేశారు. ఆ విధంగా ఈ కట్టడం యొక్క వినాశనం ప్రారంభమైంది.

ప్రాచీన శిల్పాలతో నిండిన ఈ అపురూపమైన నిక్షేపం గురించి విన్న కల్నల్ కోలిన్ మెకంజి ఈ స్థలాన్ని 1797లో సందర్శించారు. ఆ తరువాత ఆయన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆనాటికి స్తూపం ఉపరిభాగపు వ్యాసం సుమారు 30 గజాలుగా (27 మీటర్లు) ఉంది. మెకంజీ ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ఆయన తిరిగి అమరావతికి 1816 మార్చిలో కానీ రాలేకపోయారు (దాదాపు 20 సంవత్సరాలు). ఈ మధ్య కాలంలో స్తూపాన్ని రాళ్ల కోసం ధ్వంసం చేయడం జరిగింది. నీళ్ల ట్యాంక్ నిర్మాణానికిగాను స్తూపం ఉపరిభాగాన్ని స్థానిక జమిందారు త్రవ్వించాడు. మెకంజీ అక్కడే ఆరు నెలల పాటు ఉండి, ఈ కట్టడం నిర్మాణాన్ని గురించిన పూర్తి వివరాలను రికార్డు చేయడం, డ్రాయింగులు గీయించడం మొదలైన పనులను తన సిబ్బందికి పరమాయించి, అజమాయిషీ చేశాడు. 1817వ సంవత్సరాంతానికి కానీ ఈ పని పూర్తి కాలేదు. మెకంజీ యొక్క ఈ రెండవ సందర్శనకు సంబంధించిన వివరాలు 1823లో ప్రచురించబడ్డాయి. ఆయన ఈ సందర్భంగా తయారు చేసిన నోటులు, డ్రాయింగులు, ప్లాన్లు లండన్‌లోని ఓరియంటల్ అండ్ ఇండియా ఆఫీసు లైబ్రరీలో భద్రపరచబడ్డాయి.

మెకంజీ ఆ స్థలం నుంచి 11 రాతిపలకలను పెళ్లగించాడు. వాటిని కలకత్తాకు తరలించడం జరిగింది. అందులో రెండింటిని అక్కడి ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచి, మిగిలిన తొమ్మిది రాళ్లను 1821లో లండన్‌కు పంపి, వాడెన్ హాల్ స్ట్రీట్‌లోని ఈస్టిండియా కంపెనీ కలెక్షన్స్‌తో పాటు ఉంచడం జరిగింది. మెకంజీ మరికొన్ని రాళ్లను మచిలీపట్నం రేవు నుంచి తరలించాడు. ఆ తరువాత 1835 నాటికి రాబర్ట్‌సన్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి 38 రాళ్లను తరలించుకుపోయి, క్రొత్తగా నిర్మించిన మార్కెట్ ప్రాంగణంలో అలంకారంగా ఉంచాడు. ఇతని గురించిన వివారలు ఏవీ తెలియడం లేదు. ఆ