ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో నిస్తేజంగా ఉన్న అమరావతి క్రీస్తు శకం ప్రారంభకాలంనాటికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం, ప్రముఖ వ్యాపార కేంద్రం. శ్రీలంక, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి ఎందరో విద్యారులు ఇక్కడి విద్యాలయాల్లో అధ్యయనానికి వచ్చేవారు. బౌద్ధమత వినాశనం తరువాత ఈ ప్రాంత ప్రాధాన్యత తగ్గిపోయింది. చారిత్రక శిల్పసంపద భూగర్భంలో ఇమిడిపోయింది. ఒక మహాస్తూపం మాత్రం చెల్లాచెదరై దయనీయంగా పడి ఉన్న శిల్పాలను, శిల్పఖండాలను దీనంగా చూస్తూ, చరిత్రకు మౌనసాక్షిగా ఉండేది.
18వ శతాబ్దం నాటికి ఆ స్తూపం కనుమరుగైంది. స్తూపంలో అమర్చిన అపురూపమైన పాలరాతి శిల్పాలను కాల్చి బూడిద చేసి, సున్నంగా వాడుకునే దౌర్భాగ్య స్థితి దాపురించింది. అమరావతి శిథిలాల గురించి తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు మిగిలిన వాటిని సేకరించి, బ్రిటిష్ మ్యూజియానికి తరలించుకుపోయిన వివరాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి.
క్రీ.శ. 1790 నాటికి అమరావతి సూపం పూర్తిగా శిథిలమైపోయి, ఒక మట్టి దిబ్బగా మారిపోయింది. విరిగిపోయిన శిల్పావశేషాలు దాని చుటూ అక్కడక్కడ పడి వుండేవి. ఆ పరిస్థితిలో అప్పటి స్థానిక సంస్థానాధీశుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన నివాసాన్ని చింతపల్లి నుంచి అమరావతికి మార్చుకుని, 10వ శతాబ్దికి చెందిన అమరేశ్వరాలయం చుట్టుప్రక్కల రాజ ప్రాసాదాన్ని పట్టణాన్ని నిర్మించడానికి ఉద్యమించాడు. ఈ శివాలయం తెలుగు దేశంలోని అయిదు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. దురదృష్టవశాత్తు ఈ ప్రదేశానికి దగ్గరలోనే ఉన్న "దీపాల దిన్నె" అనే ప్రాంతంలో లభ్యమవుతున్న బౌద్ధమతానికి సంబంధించిన ప్రాచీన పాలరాతి ఫలకాలు భవన నిర్మాణ సామాగ్రిగా వారికి బాగా అక్కరకు వచ్చాయి. అపురూప శిల్పాలు గల అసంఖ్యాకమైన సున్నపురాతి పలకలు అమరేశ్వరాలయం ప్రక్కనే గల 'శివ గంగ" కోనేటి మెట్ల నిర్మాణానికి ఉపయోగించబడ్డాయి. స్థానిక ముస్లింలు భవన నిర్మాణానికి ఈ రాతి పలకలను ఉపయోగించడానికి ముందు, వాటిపై