పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్ మ్యూజియంలో మన అమరావతి శిల్పాలు

"ఏ యమృత క్షణమ్ముల సృజించిరో శిల్పకులీను లీజగ
ధేయములైన శిల్పముల; దెల్గు కళా ప్రతిభల్ చరిత్రలో
మాయని కీర్తి వెల్గినవి మంజుతరాంధ్ర విశిష్ట శైలికిన్
మా యమరావతీ కళకు మంగళగీతముపాడె లోకముల్"

బ్రిటీష్ మ్యూజియంను సందర్శించే వేలాది యాత్రికులు అమరావతి శిల్ప సౌందర్యాన్ని తిలకించి ఆనందాశ్చర్యచకితులవుతుంటే, శ్రీ కొండూరి వీరరాఘవాచార్యులు గారి పై పద్యం గుర్తుకు వచ్చింది.

ప్రపంచ ప్రసిద్ధ పురావస్తు ప్రదర్శనశాలల్లో బ్రిటీష్ మ్యూజియం అత్యంత ప్రముఖమైంది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన బ్రిటీష్ చక్రవర్తులు ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అద్భుత కళాఖండాలు బ్రిటీష్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. ప్రతిరోజూ వేలాదిమంది యాత్రీకులు దేశ విదేశాల నుంచి వీటిని సందర్శించడానికి వస్తుంటారు.

మనదేశం నుంచి అమూల్యమైన కళాసంపదను బ్రిటీష్ వారు తరలించుకుపోయారు. వాటిలో ప్రాముఖ్యం గల మన అమరావతి శిల్పాలు బ్రిటీష్ మ్యూజియంలో ఉన్నాయని విన్నాను. మా లండన్ యాత్రలో అమరావతి శిల్పాలను తిలకించడానికి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బోయిపాటి ప్రమోదకుమార్లతో కలిసి బ్రిటీష్ మ్యూజియానికి వెళ్లాను.