Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వజ్రదంష్ట్రుం డనువానిపీచ మడంచెఁ
        బ్లవగోత్తముఁడు మహాబలుఁడు నలుఁడు
బహువిధసమరలంపటు నకంపను బట్టి
        కుముదుండు రణభూమిఁ గూల్చి యార్చె
నతికాయబలమదోద్ధతుఁ డైనత్రిశిరుని
        సౌమిత్రి దురమున సమయఁజేసె
మునుపుగ దేవాంతకుని ద్రుంచి పదపడి
        యినసుతుండు నరాంతకుని వధించెఁ


గీ.

గుంభకర్ణాత్మజుల గాడ్పుకొడుకు దునిమె
ఖరునికొమరుని మకరాక్షుఁ గడఁగి పొదివి
పే రణంగించె గెరలి విభీషణుండు
దురమునకు నంత నింద్రజిత్తుండు వచ్చె.

115


క.

ఆయింద్రజిత్తు దారుణ
సాయకములు వరపి రామసౌమిత్రుల స
ద్గేయచరిత్రుల వీరులఁ
బాయక మోహితులఁ జేసె భండనభూమిన్.

116


ఆ.

వాయుపుత్రునివాతవాజి యై యమ్మేటి
నింగి కెగసి నిలిచి నిశితకనక
పుంఖమాన మైనభూరిశిలీముఖా
సారములను గపులబీర మడఁచె.

117


క.

ద్యోవీథి నున్న యారణ
కోవిదుశరవృష్టి నిగిడెఁ గుముదాంగదసు
గ్రీవనలజాంబవంతుల
తో వానరు లెల్లఁ ద్రెళ్ళి దుర్దశ నొందన్.

118