Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చేసిన యాపిమ్మట విన
తాసుతుఁ డచ్చోటి కతిముదం బలరఁగ వేం
చేసెను పాశవిముక్తులఁ
జేసెను రాసుతులఁ గడువిశేషప్రీతిన్.

107


ఉ.

అందు విభీషణుం గని ప్రహస్తుఁడు గొబ్బున డాసి యార్చి వా
సిం దనరారుఘోరగదచేఁ బ్రహరించినఁ గంప మేమియుం
జెందక నిల్చె దద్దనుజసింహము శీతనగంబుమాడ్కి నా
చందముఁ జూచి డెందముల జానుగ నచ్చెరు వొంది రందఱున్.

108


వ.

అంత విభీషణుండు.

109


గీ.

అష్టఘంటమహాశక్తి నడరి పూని
యల ప్రహస్తునిశిరము లక్ష్యముగ నేసె
వాఁడును హృతోత్తమాంగుఁ డై వజ్రపాత
భగ్నభూజమువలెఁ జూడఁ బడియె నపుడు.

110


చ.

అనిమొన నట్లు గూలినప్రహస్తునిఁ గన్గొని ధూమ్రలోచనుం
డనుబలురక్కసుం డతిరయంబునఁ గోతులఁ బారఁద్రోలినం
గినిసి మహీరుహంబున నొగిన్ హనుమంతుఁడు వానిఁ ద్రుంచె నా
జినిహతు వానిఁ జూచి హతశేషులు లంకకు నేగి రత్తఱిన్.

111


వ.

చని వారు సమరవృత్తాంతం బంతయు రావణునితో విన్నవించిన.

112


మ.

అసురాధీశుఁడు కుంభకర్ణు నతినిద్రాసక్తు మేల్కొల్పి శ
త్రుసమూహంబు వధించఁ బంచె నతఁడున్ దోర్గర్వ మేపార యు
ద్ధసముత్సాహము మీఱ వచ్చి కపులం దాకెం గృతాంతాకృతిన్
వెస బ్రహ్మస్త్రమున న్సుమిత్రకొడు కుర్విం గూల్చె నద్దానవున్.

113


గీ.

దూషణునితమ్ము లరిభయచూరమతులు
వజ్రదేహప్రమాదు లన్వారు గాడ్పు
కొడుకుచే నీలుచేఁ ద్రుంచఁబడిరి పఙ్క్తి
వదనుమదిలోనఁ గలుగుదుర్మదము దొలఁగ.

114