Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నెలవగువాఁడు జక్కవలనెచ్చెలి పచ్చగుఱాలజోదు గా
ములయెకిమీడు దోఁచె జగముల్ గడువేడుకఁ జెంద నత్తరిన్.

100


గీ.

వ్యూహరచన ఘటించి రఘూద్వహుండు
బలము నందందఁ దగుభంగిఁ బదిలపరచి
కడఁక నిగుడంగ రావణుఁ గదిసి పోరెఁ
గలహ మపు డయ్యె నారెండుబలములకును.

101


గీ.

మేఘనాదుండు పోరె సౌమిత్రితోడ
రవిసుతుండు విరూపాక్షుఁ గవిసి తాకె
నంగదునితోడ ఖర్పటు డని యొనర్చెఁ
బౌండ్రకుఁడు సేసె నలునితో భండనంబు.

102


క.

పుటశుఁ డనుదనుజవీరుఁడు
పటుశక్తిం దురముఁ జేసెఁ బనసునితో న
చ్చట దనుజభటులకును మ
ర్కటులకు నందఱికి ద్వంద్వకలహం బయ్యెన్.

103


వ.

అయ్యిరుదెరంగులజోడులు మచ్చరంబునం గచ్చుకొని పెచ్చుపెరి
గి విచ్చలవిడి నిట్లు వ్రేట్లాడుచున్నం బోరు ఘోరం బయ్యె ననం
తరంబ.

104


క.

ఘోరపరాక్రము లగుహరి
వీరశిఖామణులు బిట్టు విదళించిన నిం
ద్రారాతిచమూనాథులు
శూరత చెడి తిరిగి లంకఁ జొచ్చిరి భీతిన్.

105


ఉ.

ఈగతి నాజిలోన బల మెల్ల వినాశముఁ జెంద నంతటన్
వేగ దశాననుం డనుప విక్రమధుర్యుఁడు మేఘనాదుఁ డ
భ్యాగతుఁ డై వలీముఖుల నందఱి నొంచె మహావిషోజ్వల
న్నాగశరంబు వేసి నరనాథుల బదులఁ జేసె నీసునన్.

106