Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రబలమైనట్టియమదూతభయము దొలఁగు
నఖిలతీర్థాభిషేకపుణ్యము లభించు.

7


క.

శీరామేశ్వరలింగస
మారాధన మాచరించుమనుజులు మనుజుల్
గారు మహేశ్వరమూర్తులు
వారక మది సంశయంబు వల దియ్యెడలన్.

8


గీ.

హాళితోఁ దాను రామలింగార్చనంబు
సేయఁ డెవ్వఁడు దురార్గశీలుఁ డగుచు
వాఁడు పెక్కేండ్లు దరిలేని వనటఁ జెందు
ఘోరగంభీరసంసారకూపమునను.

9


ఉ.

పూనిక రామచంద్రపరిపూజితు నవ్యయు రామనాధు నీ
శానునిఁ జూచు నెవ్వఁ డొకసారె తపోనిధులార వానికిన్
దానతపోధ్వరవ్రతవిధానము లేటికి నన్యదేవతా
ధ్యానము లేటికిన్ వివిధధర్మము లేటికి కర్మ మేటికిన్.

10


చ.

శ్రుతిమయు రామనాథుఁ దనచూడ్కుల కింపుగ జూడఁ డేనరుం
డతఁడు జడుండు మూఢుఁ డత డంధుఁ డతండు కరాంఘ్రివర్జితుం
డతఁడు దరిద్రుఁ డాతఁ డురుజార్తుఁ డతండు ఖలుం డతండు త
త్సుతధనధాన్యమందిరపశుప్రకరంబు నశించు నెంతయున్.

11


ఉ.

మానుగ దుర్లభం బయిన మానుషజన్మముఁ బూని భూమిలో
మానవు లెవ్వరేని ఫణిమండనమండితు రామనాథుఁ బం
చానను గాంచి మ్రొక్కి వినయంబునఁ బూజ లొనర్తు రాజనుల్
మౌనివరేణ్యులార నుతి మత్ప్రవరుల్ కృతకృత్యు లిద్ధరన్.

12


గీ.

రామనాథునిఁ ద్రిభువనస్వామిఁ దలఁచు
వారలకుఁ బూజనము సేయువారలకును
బద్మలోచనపద్మసంభవపురంద
రాదిసురపూజనంబు నిరర్థకంబు.

13