Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యించి జింక నెక్కు నెక్కటితో మిక్కుటంబుగా వెకసక్కెం
బు లాడు వడిగలమేలుజక్కి పౌజులడెక్కలతెరవునం గ్రమ్మి ముమ్మ
రంబుగా నెగయునెలదుమ్ముకడలుంజడి యడుసు కొలుప దాడి యా
డి పుడమిచేడియకుఁ దాన యొడయం డై యడిగెడువారికోరిక కెక్కు
డుగా విడిముడి యిడుచుం గడుంబొడ వగుపొగడుఁ గాంచి పుడుకు
దొడుకుం దెగడి నెగడి కడలిరాయని నడుగుపరచి బుడుతనెలదారిం
గేరి పెట్టుచెట్టుచట్టుల రట్టుపాలు జేసి పాసిం బేర్చి నేర్చినవాఁ డై
జన్మంబు లెన్నేనియు నొనర్చి వెన్నుండు మొదలగు జన్నంపుతిండి
పిండులకుఁ బండుగ జేయుచు నక్కజం బగుచక్కదనంబునం జు
క్కలఱేనికిం జక్కెరవిలుకానికి నెక్కువ యై పక్కిజక్కిరాహత్తు
పెక్కురక్కసులం జక్కాడుకిరణి వెక్కసపుటక్కరుల నుక్క
డంచి ప్రజలయెడ నిక్కువంపుమక్కువ నెరపుచు మిక్కిలివన్నె కె
క్కి ముక్కంటిమెడకుం దొడ వగుపడగదారివడువున నుడువ వలం
తి యై తనయాన పూని కానినడకలు మాని మానికంబులు కానుక లొ
సంగి దొరలందరు శరణని మ్రొక్కుచుం గొలువ విలువలేనికలిమి
యుం బలిమియుం నెలకొని తనయందు నింపొంద చందమామచందం
బున నందఱికి విం దై యెందునుం గొఱంత లేక చెందొవవిందుతాల్ప
రియడుగుకెందమ్మిదోయి డెందంబునం బొందుపరచి హత్తుకొన్నబ
త్తిం బుత్తడివిరులగుత్తులుం దామరపువ్వుమొత్తంబు లిడి కొల్చుచు
నెత్తమ్మివిడిదిపడంతుకం దనవెడందరొమ్మున నిమ్ముగా నిడుకొన్న
క్రొన్ననవిలుకానితండ్రియుఁబోలె సిరుల నిరవొందుచు నొయ్య
న నయ్యెకిమీడు జగం బేలుచుండె నంత.

55


ఉ.

కోకిలపంచమస్వరివిఘూర్ణితకర్ణవధూవియోగిహృ
ద్భీకరపుష్పగుచ్ఛమధుబిందుఝరీవిచరన్మధువ్రతా
స్తోకసుఝంక్రియానినదశోభితసర్వజనోత్సవప్రద
శ్రీకలితంబు వొల్చె వనసీమలయందు వసంత మెంతయున్.

56