Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

259

చెప్పినారు. ఈ పదమునుండి రావణుడు తెనుగువాడో తమిళుడో అని తెలియవచ్చుచున్నది. ప్రాచీనాంధ్రవ్యాకర్తలలో నితడొకడని ప్రతీతి యుండుటచేత ఆంధ్రుడే యైయుండుననుటకు కొంత యాధార మెక్కువగా నున్నది.

రామాయణములో వర్ణింపబడిన రాక్షసులను గురించి మన మీ విధముగా తెలుసుకొనగలుగుచున్నాము. తద్విరుద్ధముగా వారితో ఆర్యులు పోరాడినప్పుడు వారు నరభక్షకులనియు, కోరలు గలవారనియు, మాయావులనియు, నానావిధములుగా వారిపై మనకు అసహ్యము కలుగు నట్లుగా వర్ణించినారు. శత్రువులను ఎన్నియో విధములుగా దూషించుట లోకాచారమే.


రాక్షస వర్గములు


ఇక రాక్షసు లెవ్వరో వారి నిజతత్త్వమెద్దియో విచారింతము. ప్రాచీనార్యులకు వివిధజాతులవారైన అనార్యులతో సంఘర్షణ లుండెను. హిందూస్థానమునకు పశ్చిమోత్తర ప్రదేశములందు ఈరానీలతో తగువు లాడిరి. వారికి పశ్చిమములోనున్న అసీరియా, బాబిలోనియా, ఖాల్డియా, ఫినికియా వారితో తగవులో వ్యాపారమో ఏదో యొకటి యుండెను. అటు హిమాలయోత్తరమున హూణులతో 1000 సంవత్సరములవరకు యుద్దాలు చేసిరి. కాకేసన్ పర్వత ప్రాంతాలలో నున్న శక (సితియన్) జాతితో తగవులాడిరి. హిందూస్థానములో సింధూనదికి తూర్పున మొదట మొదట భిల్లులవంటివారును ఇంకనూ దక్షిణములో యక్షులును, వింధ్యకు దక్షిణములో రాక్షసులును, ఆర్యులతో యుద్ధములు చేయుచుండిరి కావున ఆర్యులు తమకు భిన్నించినవారిని తమతో వైరమూనినవారిని రాక్షస వర్గములోను అసుర పిశాచవర్గములోను కట్టివేసిరి. తమతో వైరమూనిన జాతుల పేరుల నన్నింటిని తర్వాతి పౌరాణికులు కలగలిపి అసుర రాక్షస పర్యాయశబ్దములుగా నిర్వచించిరి. అందుచేతనే 'నేను' మొదలే