248
రామాయణ విశేషములు
వారును, మంచి కులములో పుట్టినవారును, కన్యకలును (పెండ్లికాని వారును) అయిన 16 మంది స్త్రీలను భార్యలనుగా ఇచ్చుచున్నాను" అని భరతుడు చెప్పెను. ఈ మాటలకు హనుమంతుడు 'నాకెందుకయ్యా! నేను నిత్యబ్రహ్మచారిని' అని అనలేదు. పాంచరాత్రములో హనుమంతుని భార్యపేరు సువర్చల యని యందురు. అతనికొక కొడుకుండెనందురు. హనుమంతునికి వివాహమయ్యెనో లేదో కాని దీనినిబట్టి యొకసంగతి స్పష్టమగుచున్నది. ఎంత పెద్దకోతియైనను భరతుడు అతనిని చూచిన వెంటనే మంచిజాతిలో పుట్టిన సుందర స్త్రీలను భార్యలనుగా ఇత్తునని చెప్పునా? హనుమంతుడు యౌవనుడుగను, చూడదగిన మనుష్యుడుగను, ఉండిననేకదా 16 సుందరాంగులైన కన్యలను భార్యలుగా బహూకృతు డగుటకు అర్హుడయ్యెను? ఈ విషయాలన్నింటినిబట్టి వానరులు నాగరికత పొందిన అనార్యజాతివారనియు, వారు కోతులు కారనియు స్పష్ట మగుచున్నది. వీరు సవర, ముందాజాతులకు, సంబంధించిన వారై యుందురు. హనుమంతుడు నిత్యబ్రహ్మచారియె యనువారికి రెండాధార ములు కానవస్తున్న వి.
(1) “అన్యత్ర భీష్మాద్గాంగేయా దన్యత్ర చ హనూమతః
హరిణీఝరమాత్రేణ చర్మణా మోహితం జగత్."
ప్రపంచములో స్త్రీలచే మోహితులు కానివారిద్దరే యిద్దరట! భీష్మ
హనుమంతులట!
(2) హనుమంతునికొక భక్తుడు షోడశనామములిచ్చి స్తుతించెను. అందు బ్రహ్మచారియను బిరుదొకటి.
“అచలోద్ధారకో భీమో బ్రహ్మచారీ మహాబలః.”
ఈ రెంటినెవరు ప్రమాణీకరించిరో తెలియదు. వాల్మీకి రామాయణ
ములో నెచ్చటను హనుమంతుడు నిత్యబ్రహ్మచారియని వర్ణింపలేదు.