Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

245

వానరులకొక భాష యుండెను. వారిలో ముఖ్యులైన వారికి సంస్కృ తముకూడ వచ్చి యుండెను. హనుమంతుని మొట్టమొదట రాముడు కలసినప్పు డతనిగూర్చి యిట్లనెను: “ఇతడు మూడు వేదాల నెరిగిన వాడుగా కనబడుచున్నాడు" (కి. 3-28). పైగా వ్యాకరణ జ్ఞాన మున్నది. (కి. 3-29). హనుమంతుడు సీతను జూచినప్పుడు ఆమెతో సంస్కృ తములో మాట్లాడుదునా లేక నా భాషలో మాట్లాడుదునా అని వితర్కించు కొనెను. (సు. 30-7). ఇందతిశయోక్తి యున్నను వానరులకొక భాష యుండెననియు వారార్యులతో మాట్లాడగలవారై యుండిరనియు ఊహించుకొనవచ్చును వానరులలో వివాహాచారములలో ఒక విశిష్టత యుండెను. అన్నదమ్ములలో ఎవరైనను గతించిన అతనిభార్యను మిగిలిన తమ్ముడు పొందుచుండెను. వాలి తన తమ్ముడగు సుగ్రీవుడు బ్రతికి యుండగా తమ్ముని భార్య యగు రుమను పొందెను. ఇది పాప కార్యమని రాముడిట్లు వాలిని దూషించెను:


“అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయం పాపకర్మకృత్.”
                                                            (కి. 18-19)


వాలి చనిపోయినప్పుడు అతని శవమునకు రాముడు దహన సంస్కారము చేయించెను. వానరులలో దహనకర్మ లేకుండెనేమో. కాని ఆర్యాచారములను రాముడు వానరులందును, రాక్షసులందును ప్రచారము చేయువాడుగా కనిపించుచున్నాడు. అందుచేతనే కబంధాది రాక్షసులను వారి కోర్కెచేత పూడ్చినవాడైనను రావణునికి దహనసంస్కారమే చేయించెను.

వానరులకు ధనుర్విద్య తెలియదు. రాక్షసులకును ఆ విద్య రాకుండెను వాలి సుగ్రీవులు కుస్తీ పట్టిరి. రాముడు తనబాణముతో వాలిని చంపుదు నన్నప్పుడు సుగ్రీవునికి దాని శక్తి తెలియనందున