Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

రామాయణ విశేషములు

ఇచ్చట నానాజాతులతోపాటు ప్లవంగజాతి యొకటి పేర్కొన బడినది. తక్కినవన్నీ మనుష్యజాతులైతే ప్లవంగజాతియు మనుష్య జాతీయే. ఆంధ్రాది ప్రాచ్యజాతులలో నిదొకటియన్నారు. కావున రామాయణకాలములోని ప్లవగజాతియు అనార్యజాతియే. తర్వాతి ప్రక్షిప్త కారులు ప్లవగశబ్దమునకు కోతియను నర్థముండుటచే వారు కోతులని భావించి పేరువ్రాసినారో యేమో?

వనచర శబ్దమునకు వానర (కోతి) అని అర్థము కలదు. అడవి మనిషి (వనేచరః) అని యర్థముకూడా కలదు. రామాయణమును పెంచిన వారు అడవిమనుష్యులకు మారుగా కోతులనే అర్థమునే స్వీకరించి యుందురు.

యస్. యస్. ప్రధాన్‌గారు (Chronology of ancient India లో) ఇట్లు వ్రాసినారు: “మహాభారతము, 13 వ పర్వం, 53-21 లో మంద పాలుడను బ్రాహ్మణుడు శార్జ్గి అను శూద్రి యందు నలుగురు కుమారు లను కనెను. అనార్యులలోని ఇంటిపేరులలో శార్జ్గి అనునదొకటి. అనా ర్యులలో అజ, మర్కట, సర్ప, నాగ, మృగ, మత్స్య అను పేరులు కల జాతులుండెను.”

ఈ విధముగా వానరులు అనార్యజాతి వారని వివిధ పండితుల అభిప్రాయము ఇక రామాయణమే ఏమి తెలుపుచున్నదో కనుగొందము. రావణునికి వానర ముఖ్యుల వర్ణించి చెప్పునప్పుడు వారు నర్మదానది, వింధ్య, పారియాత్ర, సహ్య, సుదర్శన, కృష్ణగిరి, సాల్వేయ పర్వతాల నుండి వచ్చినట్లు తెలిపెను. ఒకరిద్దరు హిమాలయ, మేరు ప్రాంతాల నుండి వచ్చినట్లు తెలిపినను ఎక్కువ వానరవీరులు దక్షిణాపథము వారే అని విశదమైనది, కృష్ణగిరి నల్లమల యేయో తెలియదు. నీలగిరి కూడా కానవచ్చును. సుదర్శన, సాల్వేయ గిరు లెచ్చటివో తెలియదు.