రామాయణ విశేషములు
239
“వనాయుః పారసీకః” అని రత్నకోశమన్నది. నదీజములనగా సింధూ నదీ ప్రాంతోద్భవములు. "వింధ్య, హిమవంతము, ఐరావతము, అంజ నాద్రి అను ప్రదేశాలనుండి ఏనుగులు దిగుమతి యయ్యెను” (బాల. 6-23, 24) అని తెలిపినారు ఐరావతమనిన ఇంద్రుని ఏనుగుయొక్క కులము అని వ్యాఖ్యాతలు వ్రాసిరి. అది తప్పు. ఇరానదీ ప్రాంతమందలి భద్రగజమునే పౌరాణికులు ఇంద్రునికి వాహనముగా జేసిరి. ఇరానది నిప్పుడు రావి యందురు. అది సింధూనది కుపనది.
దశరథుని పుత్రకామేష్టికి మిథిల, కాశి, కేకయ, అంగ, సింధు, సౌవీర, సౌరాష్ట్ర రాజులును, ప్రాచ్యదాక్షిణాత్య రాజులును ఆహూతు లైరి (బాల. 13-25) ప్రాచ్యదాక్షిణాత్యులెవరో వాల్మీకికే తెలియదు. సౌరాష్ట్రము గుజరాతు, సౌవీరముకూడ గుజరాతు భాగమే. కేకయ - బియాస్, సత్లెజ్ నదుల మధ్యదేశమని నందలాల్ దేవన్నాడు. అంగ ఇప్పటి భాగల్పూరు మండలము.
ఈ ప్రకరణమును ముగించుటకు పూర్వము మరొక్క విషయ మును స్పృశించి వదలివేయుచున్నాను. రామాయణములో సీతాన్వేషణ నిమిత్తముచే భూగోళపరిజ్ఞానము వెల్లడించినట్లే మహాభారతమందు సభా పర్వములో ధర్మరాజు యొక్క అశ్వమేధయజ్ఞార్థమై, నలుగురు తమ్ము లును నాలుగు దిక్కుల దిగ్విజయముచేయు సందర్భములో, వ్యాసుడు తన కాలమునాటి భూగోళ జ్ఞానమును వెల్లడించుకొనినాడు. ఈ రెంటిని పోల్చిచూచిన మరికొన్ని విషయములు స్పష్టపడును. అట్టి తారతమ్య పరీక్షచేయు నభిలాషులకై యీ సూచనను చేసినాను.
రామాయణమందలి ఉత్తరకాండలో చాలా కొత్త దేశాల పేరులు వచ్చును. అశ్మదేశము, వరుణపురము, బలి ఆలయము, రసాతలము మున్నగు ప్రదేశము లందు కలవు. ఉత్తరకాండ చర్చ ప్రత్యేకము చేయదగినది. అందుచేత దాని నిందు తీసుకొనలేదు.