Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

237

అనునదే శరావతియని కన్నింగ్‌హాం అన్నాడు. రాముని పూర్వజులలో నొకడగు శ్రావస్త అనువాడు నిర్మించినది శ్రావస్తియని విష్ణుపురాణ మంటున్నది. శరావతి యెక్కడిదో తృప్తికరమగు నిర్ణయముకాలేదు.”

నందాలాల్‌దేవ్‌గారు ప్రాచీన హిందూస్థాన భూగోళము (1899)లో ఇట్లు వ్రాసినారు: "శరావతి (1) గుజరాతులోని సబర్మతీనది. (2) ఔధు లోని ఫైజాబాదు. (3) శ్రావస్తియొక్క అపభ్రంశము శరావతి యైనట్లు న్నది. శ్రావస్తినిప్పుడు సాహేత్ మాహేత్ అందురు.” అట్లైనచో ఆర్యావర్తమందు చేరునా? చేరునని నేను చెప్పను. ఒక కాలములో శరావతి ఆర్యాణము అని గ్రీకులలో వర్ణింపబడిన ఆర్యులనివాసమునకు పశ్చిమసీమయైయుండెను. దానికి ఉత్తరపశ్చిమ భూములలోను ఆర్యు లుండిరి. అదే ఉదీచ్యమనవచ్చును. దానికి తూర్పుదక్షిణము ప్రాచ్యము. అటైతే టైగ్రిసునదికి పడమటిభాగమందలి దక్షిణభాగమేమై యుండును? అది ఆర్యభూమికాదు. మ్లేచ్ఛభూమి. అందే అసిరియా, బాబిలోనియా, ఫినికియా, అరేబియా, సిరియా, ఈరాఖు దేశములున్నవి. అవి అనార్యజాతుల దేశములు. అమరసింహుడు స్పష్టముగా వ్రాయక ఇంతకథకు కారకుడయ్యెను.


ఇక మనువేమన్నాడో విచారింతము:

“ఆసముద్రాత్తువై పూర్వాత్ ఆసముద్రాత్తు పశ్చిమాత్
తయోరేవాంతరం గిర్యో రార్యావర్తం విదుర్భుథాః." (2-22)


తూర్పు పడమర సముద్రాలకును వింధ్యహిమాచలములకును మధ్యన ఉండుదేశము (అనగా ఇప్పటి ఉత్తర హిందూస్థానము) ఆర్యా వర్తము. ఈ శ్లోకము మనువు సొంతముగా వ్రాసెనో ప్రక్షిప్తమో తెలియదు. ఎట్లైనను ఈ శ్లోకము పతంజలికి చాలా తర్వాతిది. ఆర్యులు తూర్పునకు, దక్షిణమునకు ఎక్కువగా వచ్చినట్లు తెలుపు భాగము